Amazon : అమెజాన్ లో భారీ గా ఉద్యోగాలు
Amazon : ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వారి శాలరీలో 80 శాతం వరకు నెలలో మొదటి 20 రోజుల్లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ వెల్లడించింది
- By Sudheer Published Date - 07:43 PM, Mon - 18 August 25

భారత్‌లో పండుగల సీజన్ మొదలవుతున్న తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ (Amazon India) భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి నుంచి ప్రారంభమై, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వరకు కొనసాగే ఈ పండుగల సీజన్‌లో దేశవ్యాప్తంగా షాపింగ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అమెజాన్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తున్నామని సంస్థ సోమవారం వెల్లడించింది.
ఈ సీజనల్ నియామకాలు ప్రధానంగా..ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు (FCs), సార్ట్ సెంటర్లు, లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లు వంటి విభాగాల్లో ఉంటాయని అమెజాన్ పేర్కొంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, లఖ్‌నవూ, కొచ్చి, కోయంబత్తూర్, ఇండోర్, రాయ్‌పూర్ వంటి 400కిపైగా నగరాల్లో ఈ అవకాశాలు లభ్యమవుతున్నాయి. ఈ నియామకాల ద్వారా వేలాది మంది మహిళలు, 2 వేలకుపైగా దివ్యాంగులకు ఉపాధి కల్పించామని సంస్థ స్పష్టం చేసింది. కొత్తగా చేరిన వారిలో అనేక మంది పండుగల తర్వాత కూడా అమెజాన్‌లో కొనసాగుతారని, ప్రతి సంవత్సరం నియామకాల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ వెల్లడించారు.
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
ఉద్యోగుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 వరకు ఆశ్రయ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బందికి మద్దతు అందిస్తోంది. అలాగే ప్రధాన నగరాల్లో 80 వేలకుపైగా డెలివరీ అసోసియేట్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. వీటిలో కంటి, దంత, బీఎంఐ, ఫిజికల్ కన్సల్టేషన్స్ వంటి పరీక్షలు ఉన్నాయి. ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లలో ఆన్‌సైట్ ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిందని అమెజాన్ వివరించింది.
ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వారి శాలరీలో 80 శాతం వరకు నెలలో మొదటి 20 రోజుల్లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో తక్షణ అవసరాల కోసం డబ్బు అందుబాటులో ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో తాత్కాలికంగానే కాకుండా శాశ్వత ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్న అమెజాన్ నిర్ణయం, ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఒక పెద్ద శుభవార్తగా నిలుస్తోంది.