GPS Attack : దక్షిణ కొరియాపై ‘జీపీఎస్’ ఎటాక్.. ఉత్తర కొరియా ఘాతుకం
శుక్రవారం నుంచి ఇప్పటివరకు దక్షిణ కొరియా జీపీఎస్ వ్యవస్థపై(GPS Attack) ఉత్తర కొరియా ఎటాక్ కొనసాగుతోందని సమాచారం.
- By Pasha Published Date - 12:30 PM, Sat - 9 November 24

GPS Attack : ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను కవ్వించింది. దక్షిణ కొరియాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)పై ఉత్తర కొరియా ఎటాక్ చేసింది. దీంతో దక్షిణ కొరియాలో విమానాలు, ఓడల సర్వీసులకు అంతరాయం కలిగింది. శుక్రవారం నుంచి ఇప్పటివరకు దక్షిణ కొరియా జీపీఎస్ వ్యవస్థపై(GPS Attack) ఉత్తర కొరియా ఎటాక్ కొనసాగుతోందని సమాచారం. ప్రత్యేకించి సౌత్ కొరియాలోని పశ్చిమ సముద్ర ప్రాంతంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. ఇలాంటి కవ్వింపు చర్యలను మానుకుంటే మంచిదని ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ సూచించారు. ఇలాంటి చేష్టల వల్ల దక్షిణ కొరియాలో ఏదైనా ప్రమాదం జరిగితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ‘‘మా దేశ జీపీఎస్ వ్యవస్థపై ఉత్తర కొరియా దాడుల వల్ల 500 విమానాలు, వందలాది నౌకలు సమస్యను ఎదుర్కొన్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి ఏవియేషన్ విభాగం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేశాం’’ అని దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకొని, సూచనలు జారీ చేసినా ఉత్తర కొరియా తీరు మారలేదని పేర్కొన్నారు.
Also Read :Seaplane : అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లోగా సర్వీసులు షురూ : రామ్మోహన్ నాయుడు
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. దక్షిణ కొరియాతో తమ దేశ సరిహద్దును మూసివేస్తున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఇరుదేశాలను కలిపే రోడ్లు, రైల్వే మార్గాలను బాంబులతో పేల్చి వేయించారు. ఉత్తర కొరియా శత్రుదేశం దక్షిణ కొరియాకు అమెరికా సైనిక సహాయాన్ని అందిస్తోంది. అందుకే ప్రస్తుతం అమెరికా మిత్రదేశం ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న రష్యాకు సాయం చేయడానికి తన సైనికులను కిమ్ పంపించారు. దాదాపు 3వేల మందికిపైగా ఉత్తర కొరియా సైనికులు ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్ బార్డర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్ తరఫున యుద్ధ రంగంలోకి నాటో దేశాలు దిగితే.. ఉత్తర కొరియా సైన్యాలను రష్యా వాడుకునే ఛాన్స్ ఉందని సమాచారం.