Aadhaar Card: ఆధార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఫ్రీగానే!
పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల స్కాన్‌లు మారే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల వారి బయోమెట్రిక్ వివరాలు ఆధార్‌లో ఉన్న పాత సమాచారంతో సరిపోలకపోవచ్చు.
- By Gopichand Published Date - 05:25 PM, Sun - 21 September 25

Aadhaar Card: ఆధార్ కార్డుకు (Aadhaar Card) సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై పిల్లలు, యువకులకు కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడానికి, బయోమెట్రిక్ అప్‌డేట్‌లు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఈ సేవలకు రూ. 50 రుసుము వసూలు చేసేవారు.
కొత్త నిబంధనల ప్రకారం.. 5 నుండి 7 సంవత్సరాల వయస్సు పిల్లలకు అలాగే 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల యువకులకు ఈ ఉచిత సేవలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పిల్లల ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్‌డేట్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.
Also Read: Prime Minister Modi: రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన!
బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?
పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల స్కాన్‌లు మారే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల వారి బయోమెట్రిక్ వివరాలు ఆధార్‌లో ఉన్న పాత సమాచారంతో సరిపోలకపోవచ్చు. అందుకే పిల్లల ఆధార్ కార్డును నిర్దేశిత వయసులలో అప్‌డేట్ చేయడం తప్పనిసరి. UIDAI అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ అప్‌డేట్‌లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బయోమెట్రిక్ అప్‌డేట్ ఎలా చేయించాలి?
బయోమెట్రిక్ అప్‌డేట్‌ను సులభంగా చేయించుకోవచ్చు. ఈ క్రింది పద్ధతిని అనుసరించండి.
సమీప ఆధార్ కేంద్రం: మొదట మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి. ఈ కేంద్రాన్ని UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ ఉపయోగించి కనుగొనవచ్చు.
ఫారం నింపడం: కేంద్రానికి వెళ్ళిన తర్వాత, ఆధార్ నమోదు, అప్‌డేట్ ఫారాన్ని తీసుకొని దానిని పూరించండి.
డేటా సమర్పణ: పూరించిన ఫారాన్ని కేంద్రంలో సమర్పించండి. కేంద్ర నిర్వాహకుడు మీ వేలిముద్రలు, కనుపాపల స్కాన్‌లను తీసుకుంటారు. ఇది అప్‌డేట్ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ఉచిత సేవలతో తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను సులభంగా, ఎటువంటి ఖర్చు లేకుండా అప్‌డేట్ చేయించుకోవచ్చు. ఇది ఆధార్ కార్డుల సరైన వినియోగానికి, భవిష్యత్ అవసరాలకు సహాయపడుతుంది.