GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా కుప్పకూలిన బంగారం ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 10-06-2026 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
పసిడి ప్రియులకు మళ్లీ బుధవారం రోజు శుభవార్త అందింది. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు, సహా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి కారణంగా నిలిచాయి. గోల్డ్ రేటు ఇవాళ ఒక్కరోజులోనే రూ. 4 వేలు తగ్గడం విశేషం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
నిన్న ఒక్కసారిగా బంగారం ధరలు పెరగగా.. ఒక్కరోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ (జూన్ 10న) ఒక్కరోజులోనే రూ. 3950 తగ్గడంతో, 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,36,450 వద్ద ఉంది. నిన్న ఇది రూ. 1350 పెరిగిన సంగతి తెలిసిందే. దానికి ముందు చూస్తే వరుసగా 10 రోజుల్లో బంగారం ధర పెరగనేలేదు. ఆ మధ్య రూ. 950, రూ. 2750, రూ. 350, రూ. 100, రూ. 750 ఇలా తగ్గుతూ వచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ప్రస్తుతం వార్త రాసే సమయంలో బుధవారం ఉదయం 10 గంటల సమయానికి రూ. 4300 తగ్గడంతో తులం రూ. 1,48,860 కి పడిపోయింది. నిన్న ఇది రూ. 1470 పెరిగింది.
ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పతనం అయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ. 10 వేలు తగ్గడంతో, ప్రస్తుతం కేజీ రూ. 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధర గత కొద్ది రోజులుగా అసలు పెరగట్లేదు. పైగా జూన్ 4 నుంచి 6 మధ్య వరుసగా 3 రోజుల్లో కలిపి రూ. 20 వేలు తగ్గింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4170 డాలర్లకు పడిపోయింది. నిన్నటి రోజు చూస్తే ఇది 4330 డాలర్ల పైన ఉండేది. అంటే రాత్రికి రాత్రే ఇది 150 డాలర్ల పైగా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు 11 వారాల కనిష్ఠానికి పడిపోవడం విశేషం. సిల్వర్ రేటు చూస్తే 68 డాలర్ల నుంచి 64 డాలర్ల దిగువకు చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.44 వద్ద ట్రేడవుతోంది.
ఇక్కడ ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి కారణం.. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. అవును.. ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి.. బంగారం ధరలు పడిపోయేలా చేస్తుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది.