Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్‌కు షాక్ ఇచ్చిన ముగ్గురు యువకులు!
ఈ ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో తమ చదువును మధ్యలో ఆపివేసి మెర్కార్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారి విజయం మరొక కొత్త కథను చెబుతోంది. మెర్కార్ విజయవంతం కావడం మొత్తం టెక్ ప్రపంచం దృష్టిని వారివైపు ఆకర్షించింది.
- By Gopichand Published Date - 05:07 PM, Mon - 3 November 25
Mark Zuckerberg: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి, ఫేస్‌బుక్‌ను స్థాపించిన మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా ఉన్న రికార్డు బద్దలైంది. ఈ ఘనతను సిలికాన్ వ్యాలీకి చెందిన ముగ్గురు 22 ఏళ్ల స్నేహితులు సంయుక్తంగా సాధించారు. భారతీయ మూలాలున్న ఆదర్శ్ హిరేమఠ్, సూర్య విధాన్‌లతో పాటు బ్రెండన్ ఫూడీ ఈ రికార్డును బద్దలు కొట్టారు. ఈ ముగ్గురు స్నేహితులు కలిసి మెర్కార్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రిక్రూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించారు.
ఈ కంపెనీకి ఇటీవల $350 మిలియన్ల నిధులు (సుమారు రూ. 2,900 కోట్లు) లభించాయి. ఈ నిధులతో కంపెనీ విలువ $10 బిలియన్లకు చేరుకుంది. ఈ అరుదైన విజయంతో ఈ ముగ్గురు స్నేహితులు అతి పిన్న వయస్కుడైన స్వయంకృషితో ఎదిగిన బిలియనీర్లుగా నిలిచారు. కాగా మార్క్ జుకర్‌బర్గ్ 23 ఏళ్ల వయస్సులో బిలియనీర్‌గా మారారు.
ఈ ప్రయాణం ఎలా ప్రారంభమైంది?
ఆదర్శ్ హిరేమఠ్, సూర్య విధాన, బ్రెండన్ ఫూడీలు కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఉన్న బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే వారి మధ్య స్నేహం బలపడింది. ఈ ముగ్గురు స్నేహితులు తరచుగా జాతీయ డిబేట్ టోర్నమెంట్‌ల కోసం సిద్ధమవుతుండేవారు. ఈ క్రమంలోనే వారి తార్కిక ఆలోచన, వేగవంతమైన విశ్లేషణ సామర్థ్యం అభివృద్ధి చెందింది.
Also Read: Kranti Goud: ఆ మహిళా క్రికెటర్‌కు రూ. కోటి నజరానా ప్రకటించిన సీఎం!
ఇది తర్వాత వారి కంపెనీ విజయానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఈ ముగ్గురు స్నేహితులు విడిపోయినప్పటికీ వారు నిరంతరం AI, భవిష్యత్తు పని విధానాల గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. కాగా సూర్య తల్లిదండ్రులు ఢిల్లీ నుండి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.
ఆదర్శ్ హిరేమఠ్ ప్రకటన
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. తాను మెర్కార్‌పై పనిచేయకుండా ఉండి ఉంటే బహుశా కొన్ని నెలల క్రితమే కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యేవాడినని హిరేమఠ్ తెలిపారు. హిరేమఠ్ ప్రకారం.. ఇంత చిన్న వయస్సులో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. హిరేమఠ్ హార్వర్డ్‌లో చదువుతున్నప్పుడు సూర్య జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో ఫారిన్ స్టడీస్ చదువుతుండగా బ్రెండన్ ఫూడీ అక్కడే ఎకనామిక్స్ చదువుతున్నారు.
ఈ ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో తమ చదువును మధ్యలో ఆపివేసి మెర్కార్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారి విజయం మరొక కొత్త కథను చెబుతోంది. మెర్కార్ విజయవంతం కావడం మొత్తం టెక్ ప్రపంచం దృష్టిని వారివైపు ఆకర్షించింది.