Bloomberg Billionaire List: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన ఒకప్పటి డెలివరీ బాయ్..!
ఆసియాలో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీని స్పానిష్ వ్యాపారవేత్త అధిగమించి ఇప్పుడు 11వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వ్యాపారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
- By Gopichand Published Date - 06:35 PM, Wed - 18 September 24

Bloomberg Billionaire List: ప్రపంచ సంపన్నుల జాబితా (Bloomberg Billionaire List)లో రిలయన్స్ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ ఒక్క స్థానం దిగజారారు. బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన సంపన్నుల తాజా ర్యాంకింగ్‌లో ముఖేష్ 12వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $112 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ మధ్య కాలంలో ఆయన కంపెనీ షేర్లు తగ్గుముఖం పట్టడమే ఆయన సంపద తగ్గుదలకు కారణం.
ఆసియాలో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీని స్పానిష్ వ్యాపారవేత్త అధిగమించి ఇప్పుడు 11వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వ్యాపారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. విశేషమేమిటంటే.. సంపదలో అంబానీని మించిపోయిన ఈ వ్యాపారవేత్త ఒకప్పుడు డెలివరీ బాయ్ కావడం విశేషం.
ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీని స్పానిష్ వ్యాపారవేత్త అమాన్సియో ఆర్టిగా అధిగమించారు. ఇతని నికర విలువ సుమారు $2 బిలియన్లు పెరిగి $113 బిలియన్లకు చేరుకుంది. Amancio Arteaga ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అయిన Inditex అతిపెద్ద వాటాదారు. కంపెనీలో అతనికి 59% వాటా ఉంది. దీని కారణంగా అతన్ని రిటైల్ రంగానికి రారాజు అని కూడా పిలుస్తారు.
తండ్రి రైల్వే కార్మికుడు.. అతని స్వంత ఉద్యోగం డెలివరీ బాయ్
అమాన్షియో కథ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అమన్సియో తండ్రి రైల్వే కూలీ. ఎలాగోలా అమాన్షియో చదువు పూర్తయిన తర్వాత డెలివరీ బాయ్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత టైలర్‌గా పని చేస్తూ బట్టల దుకాణంలో కూడా పనిచేసేవాడు. ఈ రెండు పనులు అతని భవిష్యత్తును మెరుగుపర్చాయి. ఈ పనుల ద్వారా అతను బట్టల సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. తన స్వంత దుకాణాన్ని ప్రారంభించాడు. ఇక్కడి నుంచి అతడి అదృష్టం మారిపోయింది.
ఒక దుకాణం నుండి 7,400 దుకాణాలకు ప్రయాణం
బట్టల దుకాణం నుండి పెరుగుతున్న ఆదాయం కారణంగా అమాన్సియో 1963లో లగ్జరీ వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీని తరువాత 1975లో అతను ZARA మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించాడు. Amancio 1985లో Inditex కంపెనీని ప్రారంభించాడు. ఇది నేడు ZARAతో సహా ఏడు రిటైల్ బ్రాండ్‌ల మాతృ సంస్థ. దాదాపు $34.1 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించే కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 7,400 కంటే ఎక్కువ రిటైల్ స్టోర్‌లు ఉన్నాయి. ఇది కాకుండా కంపెనీ స్పెయిన్, అమెరికాతో సహా యూరప్‌లోని అనేక పెద్ద దేశాలలో ప్రీమియం ఆఫీస్, రిటైల్ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టింది. అయితే అమాన్షియో ఇకపై వ్యాపారాన్ని స్వయంగా చూసుకోవడం లేదు. 2011లో తన వ్యాపారాన్ని కుమార్తెకు అప్పగించాడు.
15వ స్థానంలో గౌతమ్ అదానీ
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ 15వ స్థానంలో ఉన్నారు. జాబితాలో అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ X (గతంలో ట్విట్టర్) యజమాని. రెండో స్థానంలో అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ ఉన్నారు. మెటా (ఫేస్‌బుక్) యజమాని మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. మస్క్ సంపద 249 బిలియన్ డాలర్లు కాగా.. బెజోస్ సంపద 209 బిలియన్ డాలర్లతో ఉన్నారు. జుకర్ బర్గ్ సంపద 190 బిలియన్ డాలర్లుగా ఉంది.