Expensive Motorcycles: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!
భారతదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన టాప్ ఫైవ్ బైక్స్ గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:30 AM, Thu - 12 September 24

ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో ఎన్నో రకాల బైక్స్ అందుబాటులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో కొన్ని బడ్జెట్ బైక్స్ కాగా మరి కొన్ని లగ్జరీ బైక్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన బైక్స్ గురించి, వాటి ధర వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో మొదటి స్థానంలో కవాసకి నింజా హెచ్2ఆర్ బైక్ ఉంది. కవాసకి నింజా హెచ్2ఆర్ అనేది ట్రాక్ ఓన్లీ మోటార్ సైకిల్. దీన్ని పబ్లిక్ రోడ్లపై ఉపయోగించకూడదు. దీనిలోని 998 సీసీ ఇంజిన్ తో వాహనం వాయు వేగంతో పరుగులు తీస్తుంది. 17 లీటర్ ఇంధన ట్యాంక్, 830 మి.మీ ఎత్తయిన సీటు దీనికి అదనపు ఆకర్షన గా నిలుస్తుంది. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే.. కవాసకి హెచ్2ఆర్ మోటారు సైకిల్ ధర రూ.79,90,000 గా ఉంది.
అత్యంత ఖరీదైన బైక్స్ లో రెండవ స్థానంలో డుకాటి పానిగేల్ వీ4 ఆర్ బైక్ ఉంది. ఇది వేగంతో పాటు స్టైలిష్ గా ఉంటే మోటారు సైకిల్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. 193.5 కిలోల బరువైన ఈ మోటారు సైకిల్ లో 998 సీసీ ఇంజిన్, 17 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్, సౌకర్యవంతమైన సీటు ఏర్పాటు చేశారు. మంచి ఇంజినీరింగ్ పనితీరు, ఇటాలియన్ లుక్ తో ఆకట్టుకుంటోంది. కాగా ఈ డుకాటి పానిగేల్ వీ4 ఆర్ మోటారు సైకిల్ ధర రూ.69,99,000 గా ఉంది.
అలాగే అత్యంత ఖరీదైన బైక్స్ లో బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ కూడా ఒకటి. ఈ మోటార్ సైకిల్ బరువు 192 కిలోలు. దీనిలో 16.5 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్, 832 మి.మీ ఎత్తయిన సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రయాణంలో దూసుకుపోయేందుకు 999 సీసీ ఇంజిన్ ఎంతో సహాయపడుతుంది. మంచి పనితీరు, నాణ్యత కలిగిన బండి కోసం చూసేవారికి చక్కని ఎంపిక అని చెప్పాలి. బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోటారు సైకిల్ ధర రూ.49 లక్షలుగా ఉంది.
దేశీయ మార్కెట్లో ఉన్న అత్యధిక ఖరీదైన బైక్స్ లో హార్లే డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ కూడా ఒకటి. విహారయాత్రలకు అలాగే దూర ప్రయాణం చేయాలి అనుకున్న వారికి ఈ బైక్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో 1,868 సీజీ ఇంజిన్, 22.7 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్, సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రత్యేకమైన సౌండ్ తో ఆకట్టుకునే ఈ మోటారు సైకిల్ బరువు 387 కేజీలు. వేగం, సౌకర్యం రెండింటినీ అందిస్తుంది. ఈ హార్లే డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ మోటార్ సైకిల్ ధర రూ.41,78,915 గా ఉంది.
ఇండియాలో ఉన్న అత్యంత ఖరీదైన బైక్స్ లో హోండా గోల్డ్‌వింగ్ టూర్ కూడా ఒకటి. ఈ బైక్ కూడా సుదూర ప్రాంతాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. కాగా ఇందులో 1,833 సీసీ ఇంజిన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఏర్పాటు చేశారు. 390 కిలోల కర్బ్ బరువు, 21.1 లీటర్ల ఇంధన ట్యాంక్ పరిమాణం, సౌకర్యవంతమైన సీటు అదనపు ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. పవర్ కంఫర్ట్ రెండింటినీ అందించే ఈ మోటారు సైకిల్ ధర రూ.39,77,923 గా ఉంది.