కారు మీద రంగులు వదిలించుకోండిలా?!
హోలీ సంతోషాల పండుగ. కాస్త జాగ్రత్తగా ఉంటే మీరు రంగులతో ఆడుకోవడంతో పాటు మీ ప్రియమైన వాహనాలను కూడా భద్రంగా ఉంచుకోవచ్చు!
- Author : Gopichand
Date : 02-03-2026 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
Holi Paint: హోలీ అనగానే రంగులు, పిచికారీలు, సందడి కళ్లముందు కదలాడుతాయి. ఈసారి హోలీ మార్చి 4న ఉంది. కాబట్టి సిద్ధమయ్యే సమయం చాలా తక్కువగా ఉంది. రంగుల పండుగ ఆడుకోవడానికి ఎంత సరదాగా ఉంటుందో.. ఆ తర్వాత శుభ్రం చేయడం అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీ కారు, బైక్ లేదా స్కూటర్‌పై పక్కా రంగులు పడితే పరిస్థితి మరీ ఘోరం. కొన్నిసార్లు రంగులు ఎంత గట్టిగా అంటుకుంటాయంటే రుద్ది రుద్ది కడిగినా పోవు. పైగా వాహనం పెయింట్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మీ వాహనం మెరుపు తగ్గకుండా రంగు మరకలను సురక్షితంగా వదిలించుకునే మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
పక్కా రంగుల వల్ల వాహనాలకు కలిగే నష్టం
హోలీలో వాడే రంగుల్లో చాలా వరకు కెమికల్స్ ఉంటాయి. ఇవి వాహనం బాడీపై ఆరిన తర్వాత మొండి మరకలుగా మిగిలిపోతాయి. చాలామంది కంగారులో బట్టలు లేదా బ్రష్‌లతో గట్టిగా రుద్దడం వల్ల పెయింట్ పైపొర దెబ్బతింటుంది. అలాగే పవర్ ఫుల్ కెమికల్స్ వాడటం వల్ల పెయింట్ శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే రంగును తొలగించే విధానం సరైనదిగా ఉండాలి.
సబ్బు లేదా సర్ఫ్ వద్దు, షాంపూ వాడండి
చాలామంది వాహనాన్ని కడగడానికి సర్ఫ్ లేదా డిటర్జెంట్ ఉపయోగిస్తుంటారు. దీనివల్ల వాహనం తెల్లగా కనిపిస్తుంది. కానీ నీరు ఆరిన తర్వాత తెల్లటి మరకలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల పెయింట్‌లోని మెరుపు తగ్గిపోతుంది. దానికి బదులుగా షాంపూ వాడటం ఉత్తమం. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. పెయింట్‌పై ఎటువంటి దుష్ప్రభావం చూపదు.
Also Read: రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు కనిపించనున్నారు?
షాంపూ, ఈనో, టూత్‌పేస్ట్ మిశ్రమం
- వాహనంపై మొండి మరకలు ఉంటే ఈ ఇంటి చిట్కాను ప్రయత్నించవచ్చు.
- ఒక ప్లాస్టిక్ మగ్గులో సగం కంటే తక్కువ నీటిని తీసుకోండి.
- అందులో ఒక ప్యాకెట్ షాంపూ వేసి పాత టూత్ బ్రష్‌తో కలపండి.
- కొంచెం టూత్‌పేస్ట్, చివరగా అర ప్యాకెట్ ENO కలపండి.
- ఈ మిశ్రమాన్ని మరకలు ఉన్న చోట బ్రష్‌తో రాసి నెమ్మదిగా రుద్దండి. ఆ తర్వాత స్వచ్ఛమైన నీటితో కడిగేయండి. మరీ గట్టిగా రుద్దకండి.
ENO ఎలా పనిచేస్తుంది?
ENOలో సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి నురుగును సృష్టించి పేరుకుపోయిన మురికిని, రంగులను వదులు చేస్తాయి. షాంపూ ఆ రంగును సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
శుభ్రం చేసిన తర్వాత మెరుపు కోసం…
మరకలు పోయినప్పటికీ వాహనం మునుపటిలా మెరవకపోవచ్చు. అటువంటి సమయంలో షైన్ స్ప్రే లేదా పాలిష్ వాడటం మంచిది. మొదట పొడి బట్టతో దుమ్ము దులిపి, ఆపై షాంపూ నీటితో కడిగి పూర్తిగా ఆరిన తర్వాత ఈ స్ప్రే వాడితే మీ వాహనం కొత్త దానిలా మెరుస్తుంది. మార్కెట్లో ఇవి రూ. 100 నుంచి లభిస్తాయి.
హోలీ సమయంలో వాహనాలను రక్షించుకునే మార్గాలు
- వీలైతే హోలీ రోజున వాహనాన్ని బయటకు తీయకండి. కావాలంటే క్యాబ్ బుక్ చేసుకోండి.
- వాహనాన్ని కవర్ (Car/Bike Cover) కప్పండి. వాటర్‌ప్రూఫ్ కవర్ అయితే ఇంకా మంచిది.
- కారు సీట్లు, డ్యాష్‌బోర్డ్‌పై రంగులు పడకుండా జాగ్రత్త వహించండి.
- అవసరమైతే వెంటనే తుడవడానికి కారులో ఎప్పుడూ ఒక శుభ్రమైన బట్ట లేదా టవల్ ఉంచుకోండి.
- హోలీకి ముందే వాహనానికి వాక్స్ కోటింగ్ లేదా టెఫ్లాన్ కోటింగ్ చేయిస్తే రంగులు అంటకుండా ఉంటాయి. ఒకవేళ పడినా సులభంగా పోతాయి.
- హోలీ సంతోషాల పండుగ. కాస్త జాగ్రత్తగా ఉంటే మీరు రంగులతో ఆడుకోవడంతో పాటు మీ ప్రియమైన వాహనాలను కూడా భద్రంగా ఉంచుకోవచ్చు!