Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ నుంచి తక్కువ ధరకే బైక్.. ఎంతంటే?
హార్లే-డేవిడ్‌సన్ అంటే ఇప్పటివరకు ధనవంతుల విలాసవంతమైన, శక్తివంతమైన బైక్‌ల బ్రాండ్ అనే భావన ఉండేది.
- By Gopichand Published Date - 05:25 PM, Sun - 3 August 25

Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ (Harley-Davidson) అంటే ఇప్పటివరకు ధనవంతుల విలాసవంతమైన, శక్తివంతమైన బైక్‌ల బ్రాండ్ అనే భావన ఉండేది. అయితే ఈసారి ఆ నమ్మకాన్ని మార్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. హై-ఎండ్ మోడళ్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హార్లే ఇప్పుడు కొత్త తరహా వ్యూహంతో యువ రైడర్లను ఆకర్షించేందుకు ‘స్ప్రింట్’ అనే కొత్త మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఇది బ్రాండ్ చరిత్రలో ఒక కీలకమైన మలుపు కానుంది.
అత్యంత చౌకైన హార్లే: ధర, ఫీచర్లు
వార్తా నివేదికల ప్రకారం.. ఈ కొత్త స్ప్రింట్ బైక్ ధర సుమారు $6,000 (సుమారు ₹5 లక్షలు) ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఈ ధర నిజమైతే ఇది ఇప్పటివరకు హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లలో అత్యంత సరసమైన బైక్‌గా నిలుస్తుంది. ఈ ధరతో హార్లే మొదటిసారిగా మధ్యతరగతి, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ బైక్ కోసం కంపెనీ ఒక సరికొత్త ఆర్కిటెక్చర్‌ను రూపొందించింది. భవిష్యత్తులో రాబోయే అనేక కొత్త మోడళ్లకు ఇదే పునాది కానుంది. తద్వారా కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో స్థిరపడాలని చూస్తోంది.
బడ్జెట్ బైక్ సెగ్మెంట్‌లో రెండో ప్రయత్నం
హార్లే-డేవిడ్‌సన్ తక్కువ ధర బైక్‌తో మార్కెట్‌లోకి రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో భారత్ వంటి దేశాల కోసం ప్రత్యేకంగా ‘స్ట్రీట్ 750’ అనే ఎంట్రీ-లెవల్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. అది భారతదేశంలోనే తయారైంది. కానీ స్ట్రీట్ 750 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అమ్మకాలు తక్కువగా ఉండటంతో కంపెనీ ఆ మోడల్‌ను నిలిపివేయవలసి వచ్చింది. స్ట్రీట్ 750 అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి స్ప్రింట్ ద్వారా బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎక్కువ మందికి చేరువయ్యేందుకు హార్లే మళ్లీ ప్రయత్నిస్తోంది.
Also Read: MLC Kavitha : నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత
‘స్ప్రింట్’ బైక్ ఆవిష్కరణ ఎప్పుడు?
హార్లే-డేవిడ్‌సన్ ఈ కొత్త బైక్‌ను మొదట 2025 EICMA మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించనుంది. ఆ తర్వాత కొద్ది వారాలకే ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు. ఈ బైక్ బడ్జెట్ సెగ్మెంట్‌లో విజయం సాధిస్తే, హార్లే బ్రాండ్ కేవలం ధనవంతులకే పరిమితం కాకుండ యువ రైడర్లకూ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రయత్నం హార్లే చరిత్రలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చి, కంపెనీ భవిష్యత్తును మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.