Car Battery Tips: చలికాలంలో మీ కారు బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!
చలికాలంలో మీ కారు బ్యాటరీ పాడవకుండా ఎక్కువ రోజులు రావాలి అంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- By Anshu Published Date - 11:00 AM, Wed - 8 January 25

చలికాలం వచ్చింది అంటే చాలు వాహనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చలికి అంత త్వరగా స్టార్ట్ అవ్వవు. ముఖ్యంగా ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువగా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే కారు బ్యాటరీలు కూడా శీతాకాలంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాహనాన్ని సర్వీస్ చేయిస్తున్నప్పుడు మెకానిక్స్ బ్యాటరీ టెర్మినల్స్ పై గ్రీజును అప్లై చేస్తారు.
అయితే బ్యాటరీ నిపుణులు దీనిని తప్పుగా భావిస్తారు. ఇది బ్యాటరీకి హాని కలిగించవచ్చట. అందువల్ల గ్రీజుకు బదులుగా పెట్రోలియం జెల్లీ లేదా వాసెలిన్ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. బ్యాటరీ టెర్మినల్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. బ్యాటరీ టెర్మినల్స్ దగ్గర తరచుగా యాసిడ్ పేరుకుపోతుంది. ఇది శుభ్రం చేయడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. కారులో హీటర్, లైట్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఎలక్ట్రానిక్ సిస్టమ్ లు ఉన్నాయి. ఇవన్నీ ఆన్ లో ఉన్నప్పుడు అవి బ్యాటరీ శక్తిని అనవసరంగా వినియోగిస్తాయి. అవసరం ఉన్నప్పుడే వాటిని వాడుకోవాలి. కారును ఆఫ్ చేసినప్పుడు బ్యాటరీ పై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదట. అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ వేడి అయితే అది కారు బ్యాటరీపై కూడా ప్రభావం చూపుతుందట.
అటువంటి పరిస్థితిలో కారు బ్యాటరీలోని నీరు త్వరగా ఆరిపోతుంది. దీని కారణంగా బ్యాటరీ త్వరగా ఆక్సీకరణం చెందుతుందట, అందువల్ల ఇంజిన్ సంరక్షణ కూడా చాలా ముఖ్యం అని చెప్తున్నారు. బ్యాటరీ వార్మర్ కారు బ్యాటరీకి సులభంగా అందుబాటులో ఉంటంది. దీనితో మీరు బ్యాటరీని చల్లగా ఉన్నప్పుడు సులభంగా వేడి చేయవచ్చు. దీని కారణంగా పనితీరు మెరుగుపడుతుంది. బ్యాటరీ త్వరగా చెడిపోదు. ముఖ్యంగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న చోట, బ్యాటరీ వార్మర్ ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సింథటిక్ ఆయిల్ వాడకం శీతాకాలంలో కారు ఇంజిన్‌కు మంచిదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సులభంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా చల్లని వాతావరణంలో ఇంజిన్‌ను త్వరగా స్టార్ట్ చేయడంలో సహాయపడుతుంది. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది.