YSRCP Plenary 2022 : ముగిసిన వైసీపీ ప్లీనరీ, మీడియాపై తీర్మానం హైలెట్!
రాజకీయ పార్టీలు వార్షికోత్సవాలు పెట్టుకోవడం సహజం. అధికారంలో ఉంటే పాలన గురించి తెలియచేసే ప్రతిపాదనలపై చర్చస్తారు.
- By CS Rao Published Date - 04:15 PM, Sat - 9 July 22

రాజకీయ పార్టీలు వార్షికోత్సవాలు పెట్టుకోవడం సహజం. అధికారంలో ఉంటే పాలన గురించి తెలియచేసే ప్రతిపాదనలపై చర్చస్తారు.ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలను చేయడం చూశాం. మళ్లీ ఎన్నికలకు సిద్దం అయ్యేలా క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ, ఒక విభాగం మీడియాపై వైసీపీ ప్లీనరీలో చర్చకు పెట్టడడం బహుశా దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి.గుంటూరు కేంద్రంగా రెండు రోజులు జరిగిన వైసీపీ ప్లీనరీ రెండో రోజు `ఎల్లో మీడియా-దుష్టచతుష్టయం` అనే ప్రతిపాదన పెట్టారు. ఆ సందర్భంగా మీడియా అధిపతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ క్యాడర్ కు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయడం విచిత్రం. ఈటీవీ, ఈనాడు అధిపతి రామోజీరావు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు గురించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని తనదైన శైలిలో ప్రసంగించారు. సుమారు 30నిమిషాలు ప్రసంగించిన ఆయన ఎల్లో మీడియా అధిపతుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారు. బట్టనెత్తికి వెంట్రుకలు మొలిపిస్తానంటూ ప్రజల్ని మోసం చేసి టీవీ 5 చైర్మన్ 500 నుంచి 600 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. పాత సైకిల్ మీద స్ట్రింగర్ గా ఆంధ్రజ్యోతిలో పనిచేసిన రాధాకృష్ణ ఆ పత్రికను కొనుగోలు చేసిన మోసకారని దుయ్యబట్టారు. పచ్చళ్లతో వేల కోట్లకు పడగలెత్తారని రామోజీరావు మీద విరుచుకుపడ్డారు. వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబును సీఎంగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వీళ్లకు తోడుగా దత్తపుత్రుడు పవన్ తోడయ్యాడని, వీళ్లను వచ్చే ఎన్నికల్లో పాతిపెట్టాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు.
ఇదే అంశంపై మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని `దుష్టచతుష్టయం` అంటూ ఒక విభాగం మీడియాను టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఎల్లో మీడియా కూడా ప్రతిపక్షంగా భావించాలని దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని అమ్మేసిన పవన్ కల్యాణ్ అంటూ ఆరోపణలు గుప్పించారు. వాళ్ల ప్రసంగాల్లో ఎక్కువ భాగం పవన్ ను టార్గెట్ చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ చంద్రబాబును సీఎం చేయడానికి జనసేన పనిచేస్తుందని విమర్శించారు. దుష్టచతుష్టయంతో పాటు జనసేన పార్టీని అమ్మడుపోయే పార్టీగా అభివర్ణించడానికి ఎక్కువగా టైం కేటాయించారు. ఇదే అంశంపై ప్రసంగించడానికి పోసాని మురళి కి అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన వేదికపై కనిపించడం పోవడం గమనార్హం.
తొలి రోజు వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం హైలెట్ గా నిలిచింది. ఆమె రాజీనామా గురించి ప్లీనరీ వేదికగా హాట్ టాపిక్ అయింది. నాలుగు తీర్మానాలు తొలి రోజు చేసినప్పటికీ వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ ఎందుకు రాజీనామా చేశారు? కుటుంబంలో ముందుగా చర్చించుకుని చేశారా? హఠాత్తుగా వేదికపైన ఆమె ప్రకటించారా? ఎందుకు ఇలా జరిగింది? వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఇలాంటి ప్రశ్నలు ప్లీనరీకి హాజరైన క్యాడర్, లీడర్లలో వినిపించడం గమనార్హం .
పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై చర్చను తొలి రోజు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. దీనితో పాటు తొలి రోజు సామాజిక న్యాయం, పారదర్శక పాలన, వ్యవసాయ రంగం తీర్మానాలపై చర్చించారు. తొలి రోజు ప్లీనరీలో జగన్ ప్రసంగంతో ప్రతినిధుల సభ కు శ్రీకారం చుట్టారు. మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రసంగించారు. వైద్యం వ్యవసాయం పారిశ్రామికాభివృద్ధి ఉపాధి కల్పన సామాజిక న్యాయం సాధికారిత మహిళా భద్రత వంటి నవరత్నాల హామీలపై తొమ్మిది తీర్మానాలు పెట్టారు.
తొలిరోజు ప్లీనరీ సమావేశాల్లో నాలుగు తీర్మానాలు చేశారు.. మహిళా సాధికారత-దిశ చట్టంపై తొలి తీర్మానం చేయగా, విద్యా రంగంలో సంస్కరణలపై రెండో తీర్మానం, నవరత్నాలు-డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్)పై మూడో తీర్మానం, వైద్యారోగ్య రంగంపై నాలుగో తీర్మానం చేశారు. మంత్రులు. మంత్రులు రోజా, విడుదల రజనీ, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తొలి రోజే విజయమ్మ వస్తారా? అన్న సందేహంలో ఆమె జగన్‌తో కలిసి స్టేజ్ మీదకు వచ్చారు. గౌరవాధ్యక్షురాలి హోదాలో ఆమె ప్రసంగించాల్సి ఉంది. అయితే జగన్ ప్రసంగించడం గమనార్హం. ఆ తర్వాత విజయమ్మ ప్రసంగించారు. ఆమె జగన్‌ను పొగుడుతూ చంద్రబాబును విమర్శిస్తూ, సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ప్రసంగించారు. తొలి రోజే ఆమె ప్రసంగంలో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో విజయమ్మ ప్రసంగం తర్వాత ఎవరు ప్రసగించినా పెద్దగా పట్టించుకోలేదు. భోజనాల తర్వాత ఎక్కువ మంది తిరుగుముఖం పట్టారు. తొలి రోజు ప్లీనరీ కేవలం ప్రతినిధుల సభ మాత్రమే. అయినా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది.
ముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు ‘‘మనం మాత్రం జనం ఇంట ఉన్నాం. జనం గుండెల్లో ఉన్నాం. గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీలలో మాత్రమే ఉంది. ఎల్లో పేపర్లలో, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. వారికి మనకీ పోలిక ఎక్కడ? మన చేతల పాలనకు, వారి చేతగాని పాలనకూ మధ్య పోటీనా ? మన నిజాలకు వారి అబద్దాలకు మధ్య పోటీనా ? మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీనా?’’ అని జగన్ ప్రశ్నించారు.
ప్రజా జీవితంలో మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అందుకే రాష్ట్రంలో కులాల కుంపట్లు, మతాల మంటలు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. పచ్చి అబద్దాలతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. గజదొంగల ముఠాను, ఎల్లో మీడియా రాతలను, పైచాశిక మాటలకు ఇంటింటికి తిరిగి సమాధానం ఇవ్వనున్నట్టుగా జగన్ వెల్లడించారు. మూడేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క స్కీమైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. మొత్తం మీద ముగింపు ప్రసంగంలోనూ దుష్టచతుష్టయం అంటూ హైలెట్ చేయడం గమనార్హం.