YSRCP MLA : వైసీపీకి రాజీనామా చేసే యోచనలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఇటీవల
- By Prasad Published Date - 06:40 AM, Tue - 31 January 23

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఆయనపై అధిష్టానం వేటువేసింది. ఆయన స్థానంలో సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది. తాజాగా మరో ఎమ్మెల్యే అధికార పార్టీపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట. కార్యకర్తలు, అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా తన ఫోన్ ట్యాప్ అవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగడం కష్టమని కోటంరెడ్డి పేర్కొన్నారు. రహస్య సంభాషణలు, పలు సిమ్ కార్డుల కోసం తన వద్ద మరో ఫోన్ ఉందని వెల్లడించాడు. అయితే గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర బస వద్దకు వెళ్లి వారిని కలిశారు. అప్పటి నుంచి కోటంరెడ్డిపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. కోటంరెడ్డిపై వైసీపీ అధిష్టానం నిఘా పెంచినట్లు ఆయన వ్యాఖ్యలు ద్వారా స్పష్టమవుతుంది.