Posani Kishna Murali : పవన్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడటం ఏమిటి? ముద్రగడ ఎన్టీఆర్ హయాంలోనే అలా చేశారు..
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. ముద్రగడ పద్మనాభంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు పోసాని ఓ సవాల్ చేశారు.
- Author : News Desk
Date : 23-06-2023 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Kishna Murali )మరోసారి జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) లపై విమర్శల దాడిచేశారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయాడు. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ తన చుట్టూ ఉండే కాపులనే పవన్ తిడుతున్నాడు అంటూ పోసాని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం గొప్ప నాయకుడు, ఆయన ఎప్పుడూ రాజకీయ, ఆర్థిక లబ్ధికోసం వెంపర్లాడలేదు. మద్దతుగా నిలిచారు. కాపులకోసం కాపు ఉద్యమంకోసం, కాపు జాతికోసం, కాపు రిజర్వేషన్ల కోసం డబ్బులు పోగొట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిపై వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉందంటూ పోసాని వ్యాఖ్యానించారు.
ముద్రగడ పద్మనాభం నిజాయితీ కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ మీకు తెలియకపోవచ్చు.. ఎన్టీఆర్ హయాంలో ముద్రగడ పద్మనాభం మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన శాఖలో ఎన్టీఆర్ పలుసార్లు జోక్యం చేసుకోవటంతో నాకు మంత్రిపదవి వద్దని లేఖను ఎన్టీఆర్ ముఖానకొట్టి వెళ్లిపోయిన వ్యక్తి. అలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిపై పవన్ విమర్శలు చేయడం సరికాదంటూ పోసాని హితవు పిలకారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ముద్రగడ 1981 నుంచి కాపులకోసం పోరాడుతున్నారని, తన ఉద్యమంలో ఒక్కరూపాయి తిన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వెళ్లిపోతానని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిరూపించకపోతే పద్మనాభం ఇంటికి వెళ్లి క్షమాపణలు చెబితే సరిపోతుందని పోసాని అన్నారు.
చంద్రబాబు కమ్మ కులస్తులను ఎప్పుడూ ఒక్కమాట అనడు.. కానీ, పవన్ కళ్యాణ్ తన కాపు కులస్తులను తిడుతున్నాడంటూ పోసాని ఆరోపించారు. ఒకే టర్మ్ లో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి జగన్ అని పోసాని ప్రశంసలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే సీఎం జగన్ అవినీతిని నిరూపించాలని పోసాని సవాల్ చేశారు. కర్ణుడు గొప్పవాడు, అయినా దుర్మార్గుల పక్కన నిలబడి నాశనం అయ్యాడు. ఇప్పుడు పవన్ ఇదే చేస్తున్నారు అంటూ పోసాని కృష్ణ మురళి విమర్శలు చేశారు.