YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో వైఎస్ సునీత మరో పిటిషన్ దాఖలు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. హత్య జరిగిన ఐదేళ్ల నుండి ఈ ఘటనకు సంబంధించిన నిజాలు ఇంకా అధికారికంగా స్పష్టంగా తెలియలేదు. ఈ హత్యను ఎవరు చేశారన్న విషయం కోర్టు తుది తీర్పు తరువాతే స్పష్టమవుతుంది.
- By Kode Mohan Sai Published Date - 02:31 PM, Fri - 6 December 24

వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) నిందితుడైన భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సీబీఐ (CBI) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సీబీఐ సవాలు చేసిన తర్వాత, భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతా మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై శుక్రవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjeev Khanna) నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. దీనితో పాటు, భాస్కర్ రెడ్డి మరియు సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌ను సునీతా పిటీషన్‌తో కలిసి ధర్మాసనం పరిశీలించేందుకు నిర్ణయించింది. తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం సీబీఐ (CBI) విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ కేసులో హత్య చేసిన వ్యక్తి ఎవరో కోర్టు తుది తీర్పు తర్వాతే స్పష్టమవుతుందని అంచనా వేస్తున్నారు. సీబీఐ సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తోంది, కానీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఈ కేసులో దర్యాప్తు వేగం తగ్గిపోయింది.
భాస్కర్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై గత నెల నవంబర్ 29న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను మార్చి నెలలోకి వాయిదా వేసింది. ఇక, వివేకా హత్య కేసులో మరో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందడంతో అవినాష్ అరెస్ట్ వ్యవహారం నిలిచిపోయింది.
ఇప్పటికీ, వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన నిజం, ఈ హత్యలో ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ ఒక బహిరంగ రహస్యంగా మారింది. చట్టప్రకారం, దర్యాప్తు సంస్థలు అన్ని సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత, న్యాయస్థానం తీర్పు తర్వాత ఈ హత్యలో దోషుల గురించి అధికారికంగా తేలిపోతుంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు, సీబీఐ దర్యాప్తులో కొంత మందగింపు కనిపించింది. ఎన్నికల సమయం కావడంతో కొంత గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా సీబీఐ ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో ఆపాదనలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ నాయకత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం సీబీఐ అధికారులపై కూడా కేసులు నమోదు చేయించి, దర్యాప్తు ప్రక్రియను నిరోధించినట్లు వార్తలు రావడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఉండకపోవడం, జగన్ తన ప్రజల మద్దతును కోల్పోవడం కారణంగా, సీబీఐ ఈ కేసును వేగంగా విచారించడానికి అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
నిందితులకు అండగా…
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం లేకపోయింది. నిందితులను ప్రభుత్వం కాపాడే అవకాశం ఉందని అనుమానించడముతో, వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తుతో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అందరూ ఆశించారు. అయితే, కడప ఎంపీ అవినాష్ రెడ్డి హత్యలో పాల్గొన్నారని సీబీఐ ప్రాథమికంగా ఆధారాలు సేకరించిందని ప్రచారం జరిగింది. గూగుల్ టేకవుట్, టైమ్‌లైన్ ఆధారంగా అవినాష్ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందని సీబీఐ నిర్ధారించిందన్న వార్తలు వచ్చాయి.
కానీ, అవినాష్ రెడ్డిని ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయ్. “అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి” అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితిలో, అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
ఇక, ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగినట్లు కేసులోని కొందరు సాక్ష్యులు, నిందితులు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి వివరాలు వెలుగు చూసినట్లయితే, వైసీపీ పార్టీలతో పాటు సీఎం జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, జగన్ నిందితులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.