YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్ జగన్.. గంటసేపు అక్కడే?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంటపాటు స్వామిజితో చర్చలు జరిపారు.
- By Kode Mohan Sai Published Date - 05:14 PM, Wed - 20 November 24

విజయవాడలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిశారు. స్వామీజీ నుంచి ఆశీర్వాదం తీసుకున్న జగన్ దాదాపు ఒక గంటపాటు అక్కడ గడిపారు. ఈ సమయంలో స్వామీజీతో వారు చర్చించిన విషయాలను మాత్రం ఎక్కడ చెప్పలేదు. సమావేశం అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. జగన్ రాకతో స్థానిక కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు.
వైఎస్ జగన్ శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి, స్వామీజీ శ్రీ విధుశేఖర భారతీని కలవడం తాజాగా ఆసక్తి రేపింది. ఆయన అక్కడ దాదాపు ఒక గంటసేపు గడిపారు, దీంతో పీఠంలో జరిగిన చర్చలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే, వైఎస్సార్‌సీపీ వర్గాలు ఈ సందర్శనను కేవలం స్వామీజీ ఆశీస్సులు తీసుకోవడం కోసమే వెళ్లినట్లుగా పేర్కొంటున్నాయి, ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడలేదు అని తెలిపారు.
వైఎస్ జగన్ గడచిన కాలంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉండగా ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్న శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి, పీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ ఈ పీఠాన్ని సందర్శించలేదు.
ఇదిలా ఉంటే, వైఎస్ జగన్ శారదా పీఠానికి చేరుకోబోతుండగా, కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిలో కొన్ని కుటుంబాలు ఓ మృతదేహంతో హల్చల్ చేసి, తాము ఎదుర్కొన్న ఆవేదనను వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. అయితే, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని బాధితులు ఆరోపించారు.
ఈ విషయంలో కుటుంబీకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని, మృతదేహాన్ని శారదా పీఠం దగ్గరకు తీసుకువచ్చారు. పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపారు.