YS Jagan: శ్రీరాములోరి కల్యాణంకు సీఎం జగన్
రెండేళ్ల అనంతరం వంటిమిట్ట శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
- By CS Rao Published Date - 11:21 AM, Fri - 15 April 22

రెండేళ్ల అనంతరం వంటిమిట్ట శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కల్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా వంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరాముడు, సీతాదేవిల కల్యాణం జరగనుంది. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా గత రెండేళ్లుగా భక్తులు వివాహాన్ని చూడలేకపోతున్న సంగతి తెలిసిందే. ఈసారి లక్షలాది మంది భక్తుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరిగే కల్యాణోత్సవానికి మిథిలా మండపం ముస్తాబైంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం ఉదయం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు రాత్రి 8 గంటల నుంచి 9:30 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. అర్చకులు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్సేవ నిర్వహించారు. కాగా, శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.