YS Vivekananda Reddy: వివేకా హత్యా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి నోటీసులు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.
- By Kode Mohan Sai Published Date - 03:57 PM, Tue - 19 November 24

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాశ్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని, వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ కేసులో వివేకా హత్యపై అప్రూవర్‌గా మారిన వ్యక్తిని, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని, వివేకా కుమార్తె వైఎస్ సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టుకు వివరించారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు.
డాక్టర్ చైతన్య రెడ్డి జైలు నిబంధనల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు విచారణ:
డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు రెగ్యులర్‌గా వెళ్లేవారో కాదో అని సీజేఐ ధర్మాసనం పరిశీలన చేయగా, డాక్టర్ చైతన్య రెడ్డి జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఆయన రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో, డాక్టర్ చైతన్య రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చాలని లూథ్రా డిమాండ్ చేశారు. ఆయన వాదన ప్రకారం, వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి 8వ నిందితుడిగా ఉన్నారు, అలాగే దర్యాప్తులో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనల్ని పరిగణనలోకి తీసుకొని, డాక్టర్ చైతన్య రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చాలని అంగీకరించింది. అలాగే, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 3న జరగనున్నట్టు సుప్రీం కోర్టు నిర్ణయించింది.
సుప్రీం కోర్టులో సునీత, రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పిటిషన్‌పై విచారణ:
మరోవైపు సుప్రీం కోర్టులో సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరగా.. వివేకా హత్య కేసు పరిణామాలను సునీత తరఫు లాయర్ లూథ్రా కోర్టుకు వివరించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిపై ప్రైవేటు ఫిర్యాదు చేయడం ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించాలని చూశారని.. ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారన్నారు.
కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోన్న సమయంలో ప్రైవేటు ఫిర్యాదు చేశారన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే వైఎస్ సునీతా రెడ్డి ఇవాళ ఏపీ అసెంబ్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. . సీఎంవోలో వైెఎస్ వివేకా హత్య కేసు పురోగతిపై ఆరా తీశారు.