YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వాచ్‌మన్ రంగన్న మరణంపై భార్య సంచలన కామెంట్స్
మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా(YS Viveka Murder Case) పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు.
- By Pasha Published Date - 02:46 PM, Thu - 6 March 25

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య సాక్షిగా ఉన్న వైఎస్ వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న బుధవారం సాయంత్రం చనిపోయారు. రంగన్నకు శ్వాసకోశ సమస్యలు ఉండేవి. రెండు వారాల క్రితం కిందపడటంతో ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంట్లోనే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం రంగన్న ఆరోగ్యం విషమించింది. దీంతో వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. గతంలో సాక్షుల మరణాలు అనుమానాస్పదం అయ్యాయి. దీంతో రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. రంగన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వివేకా హత్య కేసులో రంగన్న సహా నలుగురు సాక్షులు వివిధ కారణాలతో చనిపోయారు.మొత్తం మీద తాజాగా వాచ్‌మన్ రంగన్న భార్య సుశీలమ్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Also Read :Sambhavna Vs Sana : బుర్ఖా ధరించమన్న సనా ఖాన్.. వీడియోపై దుమారం.. సంభావన రియాక్షన్
నా భర్త మృతికి పోలీసులే కారణం : రంగన్న భార్య సుశీలమ్మ
‘‘పోలీసులు, సీబీఐ వేధింపుల వల్లే నా భర్త రంగన్న అనారోగ్యానికి గురయ్యారు. నా భర్త మృతికి పోలీసులే కారణం. తప్పుచేసింది ఒకళ్లు, శిక్ష తన భర్త రంగన్నకు వేశారు. గత ఆరేళ్లుగా పోలీసులు మా ఇంటి ముందు కాపలా ఉన్నారు. పోలీసులు సరైన సమయంలో వైద్యం చేయించలేదు. గత మూడు నెలలుగా నా భర్త మంచంపైనే ఉన్నాడు. అప్పట్లో తప్పు చేసిన వారిని పట్టుకోకుండా నా భర్తను పట్టుకొని వేధించారు’’ అని వాచ్‌మన్ రంగన్న భార్య సుశీలమ్మ వాపోయింది. ఇక రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పులివెందుల పోలీసులకు సుశీలమ్మ ఫిర్యాదు చేసింది.
Also Read :Bujji Thalli Song: నాగ చైతన్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బుజ్జి తల్లి వచ్చేసింది!
సాక్షుల వరుస మరణాలు
మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా(YS Viveka Murder Case) పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది. ఈ కేసు మిస్టరీ ఇప్పటికీ వీడ లేదు. సాక్షులు ఒక్కరొక్కరుగా మరణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సీబీఐకు వాచ్‌మన్ రంగన్న తెలిపారు. వాటిని ఇప్పటికే రికార్డు చేశారు. కీలక సాక్షి కావడంతో పోలీసులను రక్షణగా ఉంచారు. మరో సాక్షి శ్రీనివాస్ రెడ్డి 2019లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇంకో సాక్షి గంగాధర్ రెడ్డి 2022 జూన్‌లో ప్రాణాలు కోల్పోయాడు.