WhatsApp Governance : ఏపీలో రేపటి నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..
దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
- By Latha Suma Published Date - 06:12 PM, Wed - 29 January 25
WhatsApp Governance : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో వాట్సాప్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు.
రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు.
వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్