Durga Temple : దుర్గగుడిలో మరోసారి అపచారం..
ఇంద్రకీలాద్రిపై వెలసిని కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి అపచారం జరిగింది. అమ్మ ఆశీర్వాదం కోసం లక్షల మంది భక్తులు...
- Author : Prasad
Date : 28-11-2022 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంద్రకీలాద్రిపై వెలసిని కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి అపచారం జరిగింది. అమ్మ ఆశీర్వాదం కోసం లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రి కి తరలి వస్తారు. కానుకలు, మొక్కుబడుల రూపంలో ఆ తల్లికి సమర్పించుకుంటారు. కానీ ఆ అమ్మ దయతో వేతనాలు పొందే కొంతమంది ఉద్యోగులు మాత్రం ఆ తల్లికే అపచారం జరిగేలా, అవమానం జరిగేలా వ్యవహరిస్తున్నారు. భక్తులు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావించే లడ్డూల పై కూర్చుని అపవిత్రం చేశారు. ఇందుకు దుర్గగుడి లో తాజాగా ఒక ఫొటో పై జరుగుతున్న చర్చే పెద్ద ఉదాహరణ. శానిటేషన్ విభాగంలో అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్న సుధాకర్ ను గతంలో కొండ పై కేక్ కట్ చేసిన ఘటనలో ఈవో విధుల నుంచి పూర్తిగా తొలగించారు.
తాజాగా మళ్లీ విధుల్లో చేరిన సుధాకర్.. తన తీరు మార్చుకోక పోగా… అమ్మవారి భక్తులు ను అవమానించే విధంగా వ్యవహరించడం వివాదంగా మారింది. అసలు శానిటేషన్ విభాగంలో ఉండాల్సిన సుధాకర్ టికెట్ కౌంటర్‌లో తిష్ట వేశాడు. ఐదు వందల రూపాయల టిక్కెట్లు ఇచ్చే కేంద్రంలో ఉన్న ప్రసాదాల పై కూర్చున్నాడు. ఆ విభాగంతో సంబంధం లేకపోయినా భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల పై అలా కూర్చున్న ఫొటో కూడా అక్కడి గ్రూపుల్లో హల్ చల్ చేస్తుంది. అక్కడ విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి లేకుండా… సుధాకర్ ఆ విభాగంలో ఏం చేస్తున్నాడని చర్చ సాగుతుంది. ఒకసారి తొలగించిన సుధాకర్ ను మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకున్నారో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈవో స్వయంగా తొలగించినా.. మళ్లీ తీసుకురావడం వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశంపైనా చర్చ నడుస్తుంది.

durga temple