Vijayasai Reddy : సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ ఈ నెల 15న సిట్ నోటీసులిచ్చింది. 18న విచారణకు రావాలని పేర్కొనగా... తాను 17నే వస్తానంటూ విజయసాయిరెడ్డి తొలుత సమాచారమిచ్చారు. చెప్పినట్లు గురువారమూ హాజరుకాలేదు.
- By Latha Suma Published Date - 03:33 PM, Fri - 18 April 25

Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ మధ్యాహ్నం విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఏపీ మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి ఓ ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. మొత్తం ఆరుగురు సభ్యుల బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తోంది. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే (రాజ్ కసిరెడ్డి) ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్ బృందానికి తెలిపారు. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌రెడ్డి కూడా ఈరోజు ఉదయం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరు చెప్పిన సమాధానాలకు అనుగుణంగా వేరొకరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ ఈ నెల 15న సిట్ నోటీసులిచ్చింది. 18న విచారణకు రావాలని పేర్కొనగా… తాను 17నే వస్తానంటూ విజయసాయిరెడ్డి తొలుత సమాచారమిచ్చారు. చెప్పినట్లు గురువారమూ హాజరుకాలేదు. తాను రావట్లేదంటూ మధ్యాహ్నం 12 గంటలకు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు.
కాగా, విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు, సెజ్‌లో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల 12న సీఐడీ విచారణకు హాజరై బయటకొచ్చి మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణపై ఆసక్తి నెలకొంది.
Read Also: Maoists : ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు