Kodali Nani vs Vangaveeti Radha: వంగవీటి గుడివాడకే ఫిక్సంట..?
- By HashtagU Desk Published Date - 11:18 AM, Mon - 14 March 22

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం చేశారు. దీంతో పలు పత్రికల్లో ఏపీలో ముందస్తు సమరం అంటూ పెద్ద ఎత్తున కథనాలు కూడా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తమకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.
ఇక ముందస్తు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని కీలక నేతలతో చర్చలు జరుపుతూ హాడావుడి చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్లిష్టంగా ఉన్న నియోజకవర్గాల్లో కీలకమైన నేతలను సెట్ చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గాన్ని వంగవీటి రాధకు అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. గుడివాడలో టీడీపీకి సరైన అభ్యర్ధి లేడు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయాడు.
ఈ నేపధ్యంతో గుడివాడలో వంగవీటి రాధాను బరిలోకి దించితే, అక్కడ బలంగా ఉన్న మంత్రి కొడాలి నానిని ఢీకొట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి గుడివాడను చూసుకోవాలని వంగవీటికి చంద్రబాబు సూచించారని తెలుస్తోంది. అందుకే ఇటీవల వంగవీటి రాధా అక్కడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంతో సమావేశాలు నిర్వహిండం మొదలుపెట్టారు. దీంతో మెల్లగా తాను అక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడనే సందేశాలను పంపిస్తున్నారు.
అయితే గుడివాడలో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న మంత్రి కొడాలి నాని, రాధాకు మంచి మిత్రుడు అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో మిత్రుడిపై పోటీ చేసే అవకాశాలు ఉండవని రాధాకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. అయితే మరోవైపు కొడాలి నాని మిత్రుడు కావడంతో అక్కడ పోటీ చేయరని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే రాజకీయం, రాజకీయమే.. మిత్రుత్వం, మిత్రుత్వమేనని, ఈసారి గుడివాడ నుండి వంగవీటి రాధా పోటీ చేయడం ఖాయమని, ఈ విషయంలో ఇప్పటికే రాధా ఫిక్స్ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. మరి నిజంగా రాధా మిత్రుడు కొడాలి నానితో పోటీకి సిద్దమైతే, గుడివాడలో ఈసారి ఫైట్ సెన్షేషన్ క్రియేట్ చేయడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.