Kappatralla Forest : ‘యురేనియం’ రేడియేషన్ భయాలు.. కప్పట్రాళ్లలో కలవరం
కప్పట్రాళ్ల (Kappatralla Forest) అడవుల విస్తీర్ణం 468 హెక్టార్లు కాగా, సర్వేలో భాగంగా 6.80 హెక్టార్లలో 68 చోట్ల తవ్వకాలు చేపట్టనున్నారు.
- By Pasha Published Date - 09:16 AM, Sun - 20 October 24

Kappatralla Forest : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో ఇప్పుడు ‘యురేనియం’పై చర్చ మొదలైంది. ఆ గ్రామం శివారులోని అడవుల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన యురేనియం నిక్షేపాలపై ఈ డిస్కషన్ నడుస్తోంది. వాస్తవానికిి నాలుగేళ్ల క్రితమే కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం నిక్షేపాలను నిర్ధారించారు. అయితే ఈ అడవుల్లోని ఏయే ఏరియాల్లో యురేనియం నిక్షేపాలు ఎంతమేర ఉన్నాయి ? వాటి నాణ్యత ఎంత ? తవ్వకాలు జరిపితే ఖర్చులు గిట్టుబాటు అవుతాయా ? అనే అంశాలను తెలుసుకోవడానికి త్వరలోనే ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ) సంస్థ సర్వే చేయబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కప్పట్రాళ్ల (Kappatralla Forest) అడవుల విస్తీర్ణం 468 హెక్టార్లు కాగా, సర్వేలో భాగంగా 6.80 హెక్టార్లలో 68 చోట్ల తవ్వకాలు చేపట్టనున్నారు. 4 అంగుళాల వ్యాసం ఉండే చిన్నపాటి ‘బోర్‌హోల్స్’ చేసి యురేనియం శాంపిల్స్‌ను సేకరిస్తారు. వీటిని టెస్టింగ్ చేయించి, నాణ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు నుంచి మూడేళ్లు పట్టొచ్చు. యురేనియం నిక్షేపాలు పెద్దమొత్తంలో ఉంటేనే.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇక్కడ మైనింగ్‌కు అనుమతులు లభిస్తాయి.
Also Read :Chanakya Niti : ఈ మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తే.. మీ జీవితం నాశనం..!
కప్పట్రాళ్ల అడవుల చుట్టూ కప్పట్రాళ్ల, జిల్లేడుగుడకల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమి, గుండ్లకొండ అనే గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో నివసిస్తున్న దాదాపు 20వేలమంది ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం మైనింగ్‌కు ఒకవేళ అనుమతులు లభిస్తే తమను వేరే ప్రాంతాలకు తరలిస్తారేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. యురేనియం శాంపిల్స్ సేకరణ కోసం తవ్వే బోర్‌హోల్స్ నుంచి రేడియేషన్ వెలువడుతుందనే భయం కూడా వారికి పట్టుకుంది. అయితే ఈవిషయాన్ని అధికార వర్గాలు ఖండిస్తున్నాయి. కేవలం నాలుగు అంగుళాల వ్యాసంతోనే భూమిలోపలికి రంధ్రాలు వేస్తారని చెబుతున్నారు.