Undavalli Arun Kumar: ఉండవల్లి ఫైర్.. జగన్, చంద్రబాబులను ఏకి పారేసాడు..!
- Author : HashtagU Desk
Date : 18-02-2022 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మరోసారి ఏపీ విభజన పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. విభజన నేపధ్యంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే వ్యాఖ్యానించారని ఉందవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించేటప్పుడు ఒకసారి, 2022 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌లో మరోసారి, విభజనపై స్పందిస్తూ ఏపీ విభజన బ్లాక్ డే అంటూ మోదీ వ్యాఖ్యలు చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. ఇక 2018లో మోదీ చేసిన వ్యాఖ్యలపై, నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, ఏపీ విభజనపై చర్చ జరగాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తాను సూచించానని, అయితే అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదని ఉండవల్లి ఆరోపించారు.
ఇక 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీ విభజన అంశం పై చర్చించాలని సీయం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. విభజన అంశం పై చంద్రబాబు స్పందించలేదని, మీరైనా దీనిగురించి పార్లమెంట్‌లో మాట్లాడాలని జగన్‌కు గుర్తుచేశానని ఉండవల్లి తెలిపారు. అయితే దీని పై జగన్ కూడా స్పందించలేదని ఉండవల్లి ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై కేంద్రంతో మాట్లాడే ధైర్యం చంద్రబాబు, జగన్.. ఇద్దరికీ లేదని ఉండవల్లి ఫైర్ అయ్యారు.
విభజన సమయంలో నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఏపీ విభజనపై ఏం మాట్లాడారనే దానిపై సుప్రీం కోర్టులో కేసు కూడా వేసినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించినట్లు ఉండవల్లి తెలిపారు. ఇక మరోసారి విభజన అంశం పై మళ్లీ అర్జెంట్ హీయరింగ్ కింద పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదని, ఏపీలో ఉన్న రాజకీయ నాయకులు ఇప్పటికైనా మాట్లాడాలని ఉండవల్లి సూచించారు. ఏపీ ప్రత్యేక హోదా, ఏపీ విభజన, పోలవరం అంశాలపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు.