Gannavaram : బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
Gannavaram : సాధారణంగా ఎన్నికల సమయంలో, లేదా ముఖ్యమంత్రులు/మంత్రుల పర్యటనల సందర్భాల్లో మాత్రమే ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు
- Author : Sudheer
Date : 10-12-2025 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా ఎన్నికల సమయంలో, లేదా ముఖ్యమంత్రులు/మంత్రుల పర్యటనల సందర్భాల్లో మాత్రమే ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయిన యార్లగడ్డ వెంకట్రావు మాత్రం ఈ ధోరణికి భిన్నంగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకుంటూ, వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ నిజమైన ప్రజా నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. మొన్నటికి మొన్న అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సిబ్బంది పనితీరు మరియు రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఈ చొరవ ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.

నిత్యం ప్రజల సమస్యలపై దృష్టి సారించే క్రమంలో భాగంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తాజాగా మండల పరిధిలోని దావాజీగూడెం గ్రామంలో గల బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలను సందర్శించిన ఆయన, అక్కడి బాలికల వసతి గదులు, భోజనశాల మరియు మెనూను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినిలకు వడ్డిస్తున్న ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరీక్షించారు. వసతి గృహంలోని విద్యార్థినిలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలికలకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మరియు వారి భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వసతి గృహ అధికారులను కచ్చితంగా ఆదేశించారు. అలాగే హాస్టళ్ల పరిసరాల్లో వీధి లైట్లు వెలగకపోవడాన్ని గమనించి తక్షణమే అధికారులను ఆదేశించగా వెంటనే కొత్త లైట్లు అమర్చారు. విద్యార్థుల భద్రత పట్ల ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది — దీనికి ఇదొక స్పష్టమైన నిదర్శనం
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీసుకున్న మరో ముఖ్యమైన చర్య ఏమిటంటే.. బాలికల భద్రతకు సంబంధించి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు. వసతి గృహాల వద్దకు అకతాయిలు రాకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఈ నిర్ణయం బాలికలకు భద్రత విషయంలో మరింత భరోసా కల్పించింది. స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే, వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పనితీరు, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను తెలుసుకునే ఆయన శైలి పట్ల యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానాన్ని అనుసరించి, ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.