TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-06-2026 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుందని టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
సాలకట్ల జ్యేష్టాభిషేకంలో భాగంగా మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనం పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది.
తిరుచానూరు తెప్పోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఐదు రోజుల పాటూ ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ అలమేలుమంగ తల్లి భక్తులకు దర్శనమిస్తారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మసరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షిస్తారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ తెప్పోత్సవాల్లో పాల్గొంటే భక్తుల కష్టాలు, సంసార బంధనలు తొలగి దైవానుగ్రహం, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ ప్రాశస్త్యమని టీటీడీ తెలిపింది. పద్మసరస్సులోని బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను భవసాగరంలో మునిగిపోకుండా రక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు చాటిచెబుతాయి.
జూన్ 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. జూన్ 26న శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం.. జూన్ 27 నుంచి 29 వరకు: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ వైభవంగా జరుగనున్నాయి. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అలాగే జూన్ 26న జరిగే లక్ష్మీపూజలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెప్పోత్సవాల సమయంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.