TDP: తిరువూరులో ముగ్గురి పెత్తనం.. తలలు పట్టుకుంటున్న నేతలు?
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటిలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో ఉన్న సీనియర్ లీడర్లు ను పక్కన పెట్టి కొత్త ఇంఛార్జ్ గా కార్పోరేట్ భావాలున్న శావల దేవదత్ అనే వ్యక్తిని అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించింది.
- By Balu J Published Date - 05:56 PM, Thu - 30 December 21

తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటిలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో ఉన్న సీనియర్ లీడర్లు ను పక్కన పెట్టి కొత్త ఇంఛార్జ్ గా కార్పోరేట్ భావాలున్న శావల దేవదత్ అనే వ్యక్తిని అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించింది. ఈ కొత్త ఇంఛార్జ్ వచ్చాక ఇక్కడ టీడీపీ లో విభేదాలు మరింత ముదిరాయి. శావల దేవదత్ ఇంతకముందు టీడీపీలో పని చేసిన దాఖలాలు లేవు పైగా గతంలో వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉన్నారని.. రాజకీయాల గురించి అవగాహన లేని వ్యక్తిని ఇంఛార్జ్ గా ఎలా నియమించారంటూ స్థానిక నేతలు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పదవులు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. టీడీఎల్పీలో కీలకంగా వ్యవహరిస్తున్న కోనేరు సురేష్ తన సోదరుడితో కలిసి కార్పోరేట్ ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకే దేవదత్ కి ఇంఛార్జ్ పదవి ఇప్పించారని టీడీపీ క్యాడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధిష్టానం ఆదేశాలతో ఇంఛార్జ్ గా వచ్చిన దేవదత్ తో అంతా కలిసి పని చేస్తుంటే.. లోకేష్ టీమ్ అంటూ మరొకరు ఎంట్రీ ఇచ్చి..బూత్ కన్వీనర్ ల పేరుతో నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారట. ఈ ఇంఛార్జ్ ఒంటెద్దు పోకడతోనే సతమతమవుతుంటే మళ్లీ వీళ్ల పెత్తనం ఏంటని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ టీమ్ అంటూ తెలుగు యువత విజయవాడ పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఓ చోటా నేత నియోజకవర్గంలో హాడావిడి చేస్తున్నారు. ఈ చోటా నేత గతంలో తిరువూరు టీడీపీ చేసే కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు..అయినా తనను లోకేష్ తిరువూరు నియోజకవర్గానికి పంపించారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన బీసీ, దళిత వర్గాల నాయకులను కించపరుస్తూ ఈయనే ఇంఛార్జ్ గా ఫీల్ అవుతున్నారంటూ స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ చోటా నేత బూత్ కన్వీనర్లను ఏర్పాటు చేసి తనకు నచ్చిన వారిని గ్రూప్ కన్వీనర్లను నియమించుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టిన నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారిని బూత్ కన్వీనర్లు నియమించడాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు. ఈ చోటా నేత మరో ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారని నాయకులు మదనపడుతున్నారు. దీంతో తిరువూరు టీడీపీకి ఇప్పుడు ముగ్గురు ఇంఛార్జ్ లు ఉన్నారని… ఎవరి మాట వినాలో ఎవరికి అర్థంకావడంలేదని నాయకులు ఆవేదన పడుతున్నారు.
ఇంఛార్జ్ శావల దేవదత్ ఒంటెద్దు పోకడతో స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తుండటంతో సీనియర్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేయాలన్న స్థానిక నేతలతోనే డబ్బులు ఖర్చు చేపిస్తున్నారని నాయకులు వాపోతున్నారు. రైతుల్ని మోసం చేసిన ఓ సీనియర్ నేతతోనూ, ఎంతో మందికి డబ్బులు ఎగగొట్టిన మహిళా నేతతో సన్నిహితంగా ఉంటూ మిగతా నాయకులను ఇంఛార్జ్ దేవదత్ దూరం చేసుకుంటున్నారు. ఇంఛార్జ్ లేనప్పుడు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నింటిని స్థానిక నేతలంతా కలిసి ఆర్థికంగా ఖర్చు చేసి విజయవంతం చేస్తూ వచ్చారు. అలాంటి నేతల్ని పదవుల్లో నుంచి తప్పించే ప్రయత్నం ఇంఛార్జ్ దేవదత్ చేశారు. అయితే దీనికి నిరసనగా సీనియర్లు అంతా మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్దమవ్వడంతో ఈ విషయంలో దత్ వెనక్కి తగ్గారని సమాచారం.
దాదాపు రెండేళ్ల తరువాత ఇంఛార్జ్ వచ్చినప్పటికి ఇప్పుడు కూడా తామే ఖర్చు చేయాలంటే తమకు భారంగా ఉంందని… గతంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు రాక ఇప్పటికే తాము ఆర్థికంగా నష్టపోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్న స్థానిక నేతలే చేయాలని ఇంఛార్జ్ దేవదత్ చెప్పడంతో నేతలంతా ఖంగుతింటున్నారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేసే నేతల్ని పక్కన పెట్టి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని నియంతలా వ్యవహరిస్తూ..అటు స్వామిదాస్ వర్గంతో, ఇటు మాజీ మంత్రి జవహార్ వర్గంతోనూ సఖ్యతగా ఉండటంలేదని నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికుడైన మాజీ మంత్రి జవహార్ తనయుడు ఆశీష్ లాల్ ని కూడా తిరువూరు నియోజకవర్గంలో తిరగనివ్వకుండా నియంత్రించాలని ఆయన వర్గం నేతలతో ఇంఛార్జ్ చెప్పారంట.
ఇటీవల విస్సన్నపేట మండలానికి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అందరూ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా ఇంఛార్జ్ దేవదత్ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టాల్సివస్తుందని… ప్రచారం చేయకుండా అభ్యర్థికి అనారోగ్యసమస్యను సాకుగా చూపి తప్పుకున్నారు. ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా వచ్చిన ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాల్సింది పోయి ఇలా వ్యవహరించడం నియోజకవర్గం నేతల్లో అసంతృప్తి కలిగించింది. ఈ ఎన్నికల్లో పోటీలో లేకుండా ఉన్న టీడీపీ అభ్యర్థికి 7వేల ఓట్లు రావడం కొసమెరుపు.
ఇది ఇలా ఉంటే విస్సన్నపేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నేతలంతా అట్టహాసంగా చేయాలని భావించినా… వారికి ఇంఛార్జ్ దేవదత్ మాత్రం సహకరించడంలేదట.. కార్యక్రమానికి తనవంతుగా పూలు.జెండాలు ఇస్తా తప్ప నయా పైసా ఇచ్చేది లేదని స్థానిక నేతలకు తేల్చి చెప్పి.. అధిష్టానం కి మాత్రం ఇక్కడ గొప్పగా అన్ని తానే చేస్తున్నట్లు చెప్పుకోవడం విన్సన్నపేట మండల నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నానితో పాటు జిల్లా నేతలు కూడా వస్తుండటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరువూరు లీడర్లు భావిస్తున్నారు కానీ ఇంఛార్జ్ వ్యవహారశైలి నాయకులకు ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను కూడా తనవైపు తిప్పుకోలేకపోతున్నట్లు క్యాడర్ లో చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యేని నిలదీయలేని పరిస్థితిలో టీడీపీ ఇంఛార్జ్ ఉన్నారని ఆయన సొంతమనుషులే చర్చించుకుంటున్నారు. తిరువూరు టీడీపీకి కూడా ఇంఛార్జ్ ని తీసేసి, త్రిమెన్ కమిటీ కానీ, కోఆర్డినేటర్ కానీ నియమించి అందరిని సమన్వయం చేసేలా అధిష్టానం చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ విభేదాలు దారికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు.
వార్తల్లో నిజంలేదు : దేవదత్ శావల
తిరువూరులో ముగ్గురి పెత్తనం.. తలలు పట్టుకుంటున్న నేతలు? అనే శీర్షికతో తెలుగు హ్యాష్ ట్యాగ్ యూ ప్రచురించిన కథనంపై తిరువూరు టీడీపీ ఇంచార్జి దేవదత్ స్పందించారు. ఈ మెయిల్ రూపంలో పంపిన ఆయన వివరణ ప్రకారం వార్తలోని కొన్ని అంశాలు తప్పుగా ఉన్నాయని కోడ్ చేశారు. ప్రచురించిన వార్తలో నిజంలేదని దేవదత్ కొట్టిపారేశారు. కథనంలోని కొన్ని అంశాలను ప్రశ్నిస్తూ..ఆ అంశాలను దేవదత్ ఖండించారు.