Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?
మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లా టాండా ప్రాంతంలోనూ చాలా దొంగల ముఠాలు(Tanda Gangs) ఉన్నాయి.
- By Pasha Published Date - 02:15 PM, Tue - 22 April 25

Tanda Gangs : కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలోని పలు గ్రామాలు దొంగల ముఠాలకు అడ్డాలుగా మారాయి. ఆయా గ్రామాల్లోని దొంగల కుటుంబాలు ఏటా సమ్మర్ సీజన్‌లో దక్షిణాది రాష్ట్రాలపైకి దండెత్తి వస్తున్నారు. ఆయా ముఠాలు అర్ధరాత్రి తర్వాత హల్‌చల్ చేస్తూ దొంగతనాలు, లూటీలు, హత్యలకు తెగబడుతున్నాయి. రాజస్థాన్‌కు చెందిన హవేరి ముఠా, మధ్యప్రదేశ్‌లోని అల్లిరాజ్‌పూర్, జోబాట్, జగువా గ్రామాల ముఠాలు, గుజరాత్ సరిహద్దుల్లో దాహోద్ ముఠాలు దొంగతనాలు చేస్తుంటాయి. ఈ ముఠాల సభ్యులను పట్టుకునేందుకు ఆయా గ్రామాలకు పోలీసులు వెళ్తే.. స్థానికులంతా కలిసి వ్యతిరేకిస్తున్నారు. ఇదే తరహాలో వ్యవహరిస్తున్న మరో దొంగల ముఠా వ్యవహారం తాజాగా తెలుగు రాష్ట్రాల పరిధిలో వెలుగులోకి వచ్చింది.
Also Read :Maoist Hidma : కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ?
తెలుగు రాష్ట్రాల్లోకి టాండా దొంగలు
మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లా టాండా ప్రాంతంలోనూ చాలా దొంగల ముఠాలు(Tanda Gangs) ఉన్నాయి. ఈసారి ఎండాకాలం మొదలుకాగానే ఈ ముఠాలు తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలకు చేరుకున్నాయని తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలోని పలు జిల్లాలకూ టాండా దొంగల ముఠాల సభ్యులు చేరారట. ఈ ముఠాల సభ్యులు ఉదయం టైంలో ప్రధానమైన బిజినెస్ సెంటర్లు, విలాసవంతమైన భవనాలు, విల్లాలు, ఆలయాల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఆయా చోట్ల దొంగతనాలు ఎలా చేయాలి ? దొంగతనం చేశాక ఎలా తప్పించుకోవాలి ? తప్పించుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు ఏమిటి ? దొంగతనంలో ఎంత దొరుకుతుంది ? అనే అంశాలపై ముఠాల సభ్యులు తొలుత ఒక అంచనాకు వస్తారు. తాళాలు వేసిన ఇళ్లలో టాండా దొంగల ముఠాలు ఈజీగా దొంగతనం చేస్తాయట. ఏదైనా ఏరియాలో దొంగతనం చేస్తే, మళ్లీ మూడేళ్ల దాకా అక్కడికి అస్సలు వెళ్లరట.
Also Read :Kasireddy : వసూళ్లతో లింకు లేదన్న కసిరెడ్డి.. విజయసాయి సంచలన ట్వీట్
ట్రైనింగ్ తీసుకున్నాక దొంగతనాలకు..
ఈ దొంగల ముఠాల స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని టాండా ఏరియా విషయానికి వస్తే.. అక్కడ ఇళ్లు కొండలపై ఉంటాయి. ఒకవేళ పోలీసులు అక్కడికి వెళితే గ్రామస్తులంతా ఏకమై నాటు తుపాకులు, బాణాలతో దాడి చేస్తారు. అందుకే ఒక చోరీ కేసు దర్యాప్తు కోసం టాండా ఏరియాకు పోలీసులు పదిసార్లకుపైగా వెళ్లాల్సి వస్తుంటుంది. రాత్రి 7 దాటితే పోలీసులు సైతం టాండా ఏరియాలో తిరగలేరు. టాండా ఏరియాలోని దొంగల ముఠాలు తమ సభ్యులకు దొంగతనం చేయడంపై, తప్పించుకోవడంపై ట్రైనింగ్ కూడా ఇస్తాయట. అందుకే టాండాలోని దొంగలను పట్టుకోవడం, వారి నుంచి చోరీ సొత్తును రికవర్ చేయడం అనేది పెద్ద సవాల్‌గా మిగిలిపోయింది. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, విజయనగరంలో 3, శ్రీకాకుళం, అనకాపల్లి పరిధిలో జరిగిన చెరో చోరీ కేసులో టాండా దొంగల ముఠాల హస్తం ఉంది.