Kasireddy : వసూళ్లతో లింకు లేదన్న కసిరెడ్డి.. విజయసాయి సంచలన ట్వీట్
గతంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి(Kasireddy) ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కసిరెడ్డికి అధికారులు ప్రశ్నలు వేస్తున్నారని సమాచారం.
- Author : Pasha
Date : 22-04-2025 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
Kasireddy : మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విచారిస్తోంది. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు సహా ఏడుగురు అధికారుల బృందం కసిరెడ్డిని ప్రశ్నలు అడుగుతోంది. వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో భారీ లిక్కర్ స్కాం జరిగింది. ఆ స్కాంలో పెద్ద రేంజులో వసూళ్ల నెట్‌వర్క్‌ను కసిరెడ్డి నడిపారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై సిట్ అధికారులు ప్రశ్నించగా.. ‘‘నాకు వసూళ్ల నెట్‌వర్క్‌తో లింకు లేదు’’ అని కసిరెడ్డి తేల్చి చెప్పాడట. గతంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి(Kasireddy) ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కసిరెడ్డికి అధికారులు ప్రశ్నలు వేస్తున్నారని సమాచారం. సోమవారం రాత్రి సిట్ అధికారుల విచారణకు కసిరెడ్డి సహకరించలేదని సమాచారం. దీంతో పలు ఆధారాలను ముందుపెట్టి, వాటిని చూపిస్తూ సిట్ అధికారులు ప్రశ్నలు అడిగారట.కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను విజయవాడకు తీసుకొచ్చి విచారణ మొదలుపెట్టారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025
Also Read :PSR Anjaneyulu: ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్
విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్
ఈనేపథ్యంలో వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై కీలక వ్యాఖ్యలతో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో నుంచి తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని విజయసాయి పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ దొంగలను బయటకు లాక్కొచ్చేందుకు పూర్తిగా సహకరిస్తానని ఆయన వెల్లడించారు. ‘‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఒక్క రూపాయిని కూడా నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’’ అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు కసిరెడ్డిని సిట్ విచారిస్తున్న ప్రస్తుత తరుణంలో విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో దీనిపై విజయసాయి మాట్లాడుతూ.. ‘‘ లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డే’’ అని చెప్పారు. ఈమేరకు సిట్ అధికారులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు.