Basavatarakam Cancer Hospital: అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.. శంకుస్థాపన ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో బసవ తారకం ఆస్పత్రికి 15 ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, అమరావతిలో ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు.
- By Kode Mohan Sai Published Date - 12:22 PM, Tue - 3 December 24

ఆంధ్రప్రదేశ్‌లో బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి కసరత్తు వేగవంతం అయ్యింది. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఈ ఆస్పత్రి మరియు రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల 15 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, స్థలం కేటాయించిన ప్రాంతంలో చిన్న ఇబ్బందిని గమనించారు. ఆస్పత్రి కోసం కేటాయించిన స్థలం దగ్గర హెచ్‌టి విద్యుత్తు లైన్లు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సీఆర్డీఏ అధికారులు ట్రాన్స్‌కోకు లేఖ రాయగా, ఈ విద్యుత్ లైన్లను తొలగించే పనులను ఇప్పటికే కాంట్రాక్టుకు అప్పగించినట్లు సమాచారం.
అమరావతిలో 300 పడకలతో ఆస్పత్రి నిర్మాణం ఫేజ్-1లో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసారు. రాబోయే రోజుల్లో దీనిని 1000 పడకల ఆస్పత్రిగా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. అమరావతిలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి యాజమాన్యం పలు డిజైన్లను ఫైనల్ చేసినట్లు కూడా సమాచారం. బసవ తారకం ఆస్పత్రికి సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌తో సంప్రదింపులు జరిపారు. ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్ల తొలగింపు పూర్తయిన తరువాత జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు.
వాస్తవానికి, 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలో బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి కోసం స్థలం కేటాయించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళి స్థలం కేటాయించడంతో, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలన్న సంకల్పంతో ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. నందమూరి తారకరామారావు సతీమణి బసవ తారకరామారావు కేన్సర్ కారణంగా మరణించారు. ఆమె అనుభవించిన కేన్సర్ సమస్యను ఇతరులు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో, ఎన్టీఆర్ హైదరాబాద్‌లో బసవ తారకం కేన్సర్ ఆస్పత్రిని స్థాపించారు. ఈ ఆస్పత్రిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న రోగులకు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తారు. అదేవిధంగా, వైద్య ఖర్చులు చెల్లించే స్థోమత లేని వారికి కూడా ఉచిత వైద్యం అందించడమే కాక, కార్పస్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. 2014-2019 మధ్య విజయవాడలో బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డాక్టర్లు కొంతకాలం వైద్య సేవలు అందించారు.