TDP vs YCP : గన్నవరంలో మరోసారి ఉద్రిక్తత.. మరో కారుని తగలబెట్టిన వైసీపీ నేతలు
గన్నవరంలో నాలుగు గంటలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించడంతో
- Author : Prasad
Date : 20-02-2023 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
TDP vs YCP : గన్నవరంలో నాలుగు గంటలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలంతా కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్‌లో ఉన్న కార్లు, బైక్‌లను ధ్వసం చేసిన వైసీపీ నేతలు.. బయట ఉన్న మరోకారుని తగలబెట్టారు. అయితే పోలీసులు మాత్రం వైసీపీ నేతల్ని కట్టడి చేయకుండా తమ నాయకులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ, బోడె ప్రసాద్‌లు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేసి అరాచకానికి తెగబడ్డాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. పోలీసుల సమక్షంలో కార్యాలయం పై దాడి చేసి వాహనాలను తగలబెడితే విజయవాడ పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజయవాడ కలకత్తా నేషనల్ హైవేని బ్లాక్ చేసి వైసీపీ గుండాలు దాడి చేశారంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది తప్పుడు అధికారుల వల్ల ఖాకీ దుస్తుల విలువ దిగజారిపోతుందని.. మహిళల పట్ల కూడా విచక్షణ రహితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పట్టాభిని ఎన్ కౌంటర్ చేసేందుకు సెక్యూరిటీ గార్డులను తోసేసి పోలీసులు పట్టాభిని ఎత్తుకెళ్లిపోయారని దేవినేని ఉమా ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం కోసం వంశీ పార్టీ కార్యాలయాలను తగలబెట్టారని ఉమా తెలిపారు.