Chandrababu Oath : చంద్రబాబు `శపథం`కు సడలింపు
`ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతా..` అంటూ చంద్రబాబు చేసిన శపథం సడలిపోయే అవకాశం కనిపిస్తోంది.
- Author : CS Rao
Date : 12-07-2022 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
`ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతా..` అంటూ చంద్రబాబు చేసిన శపథం సడలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఈనెల 18వ తేదీన అసెంబ్లీకి వస్తారని తెలుస్తోంది. ఆ రోజున రాష్ట్రపతి ఎన్నికలకు జరగబోతున్నాయి. ఓటు వేసేందుకు ఆయన రానున్నారని సమాచారం. అధికారపక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు భువనేశ్వరి శీలాన్ని ప్రశ్నిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు మనస్తాపం చెందారు. ఆ సందర్భంగా మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని శపథం చేసి బయటకొచ్చిన విషయం విదితమే.
కానీ, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు టీడీపీ మద్ధతు ప్రకటించింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు, లోక్ సభలోని ముగ్గురు ఎంపీలు ఆదివాసీ గిరిజన తెగకు చెందిన ఆమెకు ఓటేయాలని పార్టీ ఆదేశించింది. ఆ మేరకు అధికారికంగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యలమన రామక్రిష్ణుడు ప్రకటించారు.
ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ కు కూడా ఆనాడు టీడీపీ మద్ధతు ఇచ్చింది. దళితవర్గానికి చెందిన ఆయనకు భేషరతు మద్దతు ఇచ్చింది. పైగా అప్పట్లో ఎన్డీయేలో భాగస్వామిగా టీడీపీ ఉండేది. ఆనాడు విపక్షంగా ఉన్న వైసీపీ కూడా కోవింద్ కు సంపూర్ణ మద్ధతు ఇచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అధికారికంగా ఎన్డీయేలో భాగస్వామి కాదు. అయినప్పటికీ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ముర్ముకు మద్ధతుగా నిలిచింది. ఆమె నామినేషన్ రోజే వైసీపీ ఎంపీలు ప్రతిపాదన చేసిన విషయం విదితమే.
ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఎన్డీయే కు 2018 నుంచి దూరంగా ఉంటోంది. అధికారపక్షం కూడా ఎన్టీయేలో భాగస్వామి కాదు. అయినప్పటికీ అధికార, ప్రతిపక్షాలు ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు ఇస్తూ ప్రకటించడం గమనార్హం. ఆ క్రమంలో చంద్రబాబు ఈనెల 18వ తేదీ ఓటేసేందుకు అసెంబ్లీకి వస్తారని పార్టీ వర్గాల్లోకి వినికిడి. ఒక వేళ ఆయన రాకపోతే ఓటు హక్కు వినియోగించుకోని సీనియర్ లీడర్ గా ముద్ర పడుతుంది. ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేసే అవకాశం ఉంది. అందుకే, వాళ్లకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీకి వచ్చి ఓటేయాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆదివాసీ గిరిజన మహిళ కోసం శపథాన్ని పక్కన పెట్టబోతున్నారు చంద్రబాబు.