TDP MP Kesineni Nani : చంద్రబాబు కోసం రిషికేశ్‌లో యాగం చేసిన టీడీపీ ఎంపీ
కేసుల నుంచి చంద్రబాబు నాయుడు బయటపడాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని రిషికేశ్‌లో యాగం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్
- Author : Prasad
Date : 13-09-2023 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
కేసుల నుంచి చంద్రబాబు నాయుడు బయటపడాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని రిషికేశ్‌లో యాగం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు కోసం పూజలు నిర్వహిస్తున్నారు. గంగా నది ఒడ్డున ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్‌లో యాగం నిర్వహించారు. చంద్రబాబును అన్ని కేసుల నుంచి విముక్తి చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కేశినేని నాని తెలిపారు. ఈ కార్యసిద్ధ యాగం ద్వారా అన్నీ నెరవేరుతాయని అన్నారు.
అంతేకాదు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కేశినేని నాని కూడా చంద్రబాబును కలిశారు. చాలా రోజుల తర్వాత పార్టీ అధినేతను కేశినేని నాని కలవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంటపాటు చంద్రబాబుతో కేశినేని నాని మకాం వేశారు. గతంలో టీడీపీ నాయకత్వంతో కేశినేనికి విభేదాలు ఉన్నాయని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయవాడలో నిర్వహించిన యువ గళం పాదయాత్రకు కూడా గైర్హాజరయ్యారని ప్రచారం సాగింది. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం ఎంపీ కేశినేని నాని ఎప్పుడు అధినేతకు అండగా ఉంటూ వస్తునే ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తే అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని నానికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టమవుతుంది.