TDP : ఉండవల్లీ.. నువ్వు ఊసరవెల్లిలా ఎందుకు మారావ్..? మాజీ మంత్రి అయ్యన్న
మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్ బాగా
- Author : Prasad
Date : 27-09-2023 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్ బాగా చదువుకున్నారని..తన కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఆయనను నేడు రాష్ట్ర ప్రజలు ఊసరవెల్లి అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు స్కిల్ కేసును సీబీఐతో విచారించాలని హైకోర్టులో ఉండవల్లి కేసు వేశారని.. అసలు ఆ కేసులో ఏమైనా పస ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఆ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారమైనా ఉందా? డబ్బులు ఏదైనా చంద్రబాబు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వెళ్లినట్లు ఆధారం ఉందా? అని అయ్యన్న ప్రశ్నించారు. చంద్రబాబును బయట తిరగనివ్వకూడదనే దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతుంటే… దానికి ఉండవల్లి సహకరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో కథలు చెప్పావ్…నేటి పాలనపై ఒక్కసారి అయినా మాట్లాడావా? అంటూ ఉండవల్లిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
తిరుపతి దేవస్థానంలో విపరీతమైన దోపిడీ జరుగుతుంటే ఒక్కసారి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నోరు విప్పలేదన్నారు. దేవస్థానాలకు చెందిన 43వేల ఎకరాలు కనబడడం లేదు అని మంత్రి చెబితే ఒక్కసారి కూడా నోరెత్తలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. గోదావరిలో ఇసుకను దోచుకుంటున్న వారిపై ఎందుకు మాట్లాడలేదు? ఆ ఇసుక దోపిడీలో నీకు ఏమైనా వాటా ఉందా? అని ప్రశ్నించారు. రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఒక్కసారి కూడా మాట్లాడలేదని.. కత్తిపూడి జంక్షన్ వద్ద ఫారెస్ట్ భూముల్లో ఖనిజ సంపద దోచుకుంటుంటే ఒక్కసారి కూడా ఉండవల్లి నోరెత్తలేదని తెలిపారు. ల్యాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి దాన్ని భారతి సిమెంట్ కంపెనీలకు టిప్పర్లతో పోలీసుల కనుసన్నల్లో తోలుతుంటే ఒక్కసారి కూడా ఎందుకు నోరెత్తలేదని ఉండవల్లిని ప్రశ్నించారు. లక్షల టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏడిపిస్తుంటే ఎందుకు నోరెత్తలేదు? మేధావిగా చెప్పుకుని తిరిగే నువ్వు తప్పుడు మనుషులకు సహకరించడం ఏంటి? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.