TDP Congress Alliance : కాంగ్రెస్ తో పొత్తుకు బాబు రెడీ ?
- By Sudheer Published Date - 08:24 PM, Fri - 29 December 23

డా. ప్రసాదమూర్తి
రాజకీయాలలో నాటకీయ పరిణామాలు అత్యంత సహజం. అలాగే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది కూడా అంతే సహజం. ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ వ్యూహాన్ని రచించి ముందుకు వెళ్లడానికి ప్రతి పార్టీ నాయకుడుగా ప్రయత్నం చేస్తాడు అనేది కూడా పరమ సత్యం. ఇలా సహజమైన, సత్యమైన రాజకీయాల గురించి రాజకీయ విజ్ఞత కలిగిన విశ్లేషకులు మాత్రమే అర్థం చేసుకోగలరు. చంద్రబాబు (Chandrababu) నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ను కలిశారు. ఇక మీడియాకు పండగే పండగ. అంటే చంద్రబాబు కాంగ్రెస్తో మళ్ళీ పొత్తుకు వెళుతున్నారా, బిజెపితో బంధం తెంచుకుంటున్నారా, అలా జరిగితే బిజెపి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి ముప్పేట దాడి చేస్తే అధికార వైసీపీకి పరాజయం తప్పదా..?, ఇలాంటి ఊహాగానాలు విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. వాస్తవానికి చంద్రబాబు డీకే శివకుమార్ ని ఎందుకు కలిశారు.. అసలు కారణం ఏమిటి.. వారిద్దరి కలయికలో జరిగిన మంతనాలు ఏంటి.. ఆ మంతనాల ఫలితాలు ఏంటి.. ఆ మంతనాల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన జవాబు రావాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగుతున్న మలుపులు, ఇటీవల సరిహద్దు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకోవడం.. ఇలా ఇటీవల జరిగిన తాజా పరిణామాలను చూస్తే బాబు చూపు బిజెపి వైపు నుంచి కాంగ్రెస్ వైపు మళ్లిందేమో అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది.
చంద్రబాబు (Chandrababu) వ్యూహం:
రాజకీయాలలో రాటుదేలిన వ్యూహకర్త, అపర చాణక్యుడుగా ప్రసిద్ధి చెందిన చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే ఫ్లెక్సిబిలిటీని కనబరుస్తారు. గతంలో కమ్యూనిస్టులతో కలిసినప్పుడు, బిజెపితో అనేకమార్లు కలవడం విడిపోవడం.. అలాగే విడిపోవడం కలవడం.. ఇలాంటి దశలన్నీ గుర్తు చేసుకుంటే చంద్రబాబుకు రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం ఎవరితోనూ లేదని, అలాగే శాశ్వత మిత్రత్వం కూడా ఎవరితోనూ లేదని మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే దశలో లేదు. కానీ తెలంగాణలో ఆ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల, కాంగ్రెస్ లో చేరుతుందని, ఆమెకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పజెప్తారని, లేదా ఆంధ్ర ప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా చేయవచ్చని ఇలా అనేక ఊహాగానాలు వినవస్తున్నాయి. అంతేకాదు వైయస్ షర్మిల నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. అది వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరఫున అని ఆమె పేర్కొన్నది. అలాగే అందుకు ప్రతిగా నారా లోకేష్ నారావారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇది మామూలు పరిణామం కాదు. ఏ నేపథ్యంలో ఈ పరిణామాలు అన్నీ జరుగుతున్నాయో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి కూడా చక్కగా బోధపడుతుంది. మరోపక్క బీజేపీ వైపు చంద్రబాబు ఎంతగా ఎదురు తెన్నులు చూసినా, ఆ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బిజెపి ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముక్కలాట ఆడుతోంది. ఎవరు గెలిచినా కేంద్రంలో తమకు ఆంధ్ర నుంచి పూర్తి మద్దతును పొందాలని బిజెపి వ్యూహం. కానీ చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లో అధికారం ముఖ్యం. రాష్ట్రంలో అధికారానికి వస్తే కేంద్రంలో రాజకీయాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. అందుకే బిజెపిని రోడ్డు మ్యాప్ ఇమ్మని అడిగినా, బిజెపి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలూ రావడం లేదు. అంతేకాదు 2019 ఎన్నికల తర్వాత వైసిపి కేంద్రంలోని బీజేపీతో గట్టి బంధాన్ని ఏర్పరచుకుంది. గతంలో బిజెపి సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, వైసిపి ఇటీవల పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా బిజెపికి అనుకూలంగా వైసీపీ ఓటు వేసింది.
తెలుగుదేశం కూడా బిజెపికి అనుకూలంగానే ఆ తీర్మానంలో ఓటు వేసింది. కానీ బిజెపి వారు చంద్రబాబు వైపు మళ్ళితే వైసీపీని వదులుకోవాల్సి వస్తుందని ఆటో ఇటో తేల్చుకోలేక వారు తికమక పడుతూ చంద్రబాబుకు ఎలాంటి సంకేతాలూ ఇవ్వడం లేదు. దీనిబట్టి అర్థమవుతున్నది ఏమిటంటే, బిజెపి బంధం వైసిపితో ఎక్కువ బలంగా ఉందని, అది తెంపడం సాధ్యం కాదని. పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా బిజెపి నుంచి ఏ విధమైన సానుకూల స్పందనా రాలేదు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మరో దారి లేదు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి పరోక్షంగా లాభపడిన తెలుగుదేశం పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్రాలో లాభపడడానికి ఇప్పుడు బాబు ఆలోచిస్తూ ఉండవచ్చు.
గతంలో 2018లో తెలంగాణ ఎన్నికల సమయంలో మహా ఘటబంధన్ ఏర్పాటుచేసిన కూటమిలో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. అయితే ఆ కూటమి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల 2019లో చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు. ఈ ఐదేళ్ల పరిణామాలు చంద్రబాబుకు చాలా పాఠాలే నేర్పాయి. తాడోపేడో తేల్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. అధికార వైసిపికి వ్యతిరేకంగా ప్రజలలో చాలా అసంతృప్తి నెలకొని ఉంది. ఇప్పుడు తనకు కలిసి వచ్చే అన్ని పార్టీలనూ అన్ని అవకాశాలనూ సమీకరించుకోవాల్సిన అనివార్య పరిస్థితి బాబుకి ఏర్పడింది.
అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ముందే చెప్పుకున్నట్టు రాజకీయాలలో ఎవరూ శాశ్వత శత్రువులు ఉండరు, ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాలలో కేవలం ఓటమి, గెలుపు అనే రెండు అంశాలు మాత్రమే ఉంటాయి. ప్రతి నాయకుడూ గెలుపు వైపే తన ప్రస్థానం సాగాలని కోరుకుంటాడు. ఈ వెలుగులో చంద్రబాబు తాజా వ్యూహాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది.
Read Also : TDP : “గిరిజన ద్రోహి జగన్ రెడ్డి “పేరుతో కరపత్రం విడుదల చేసిన టీడీపీ