Chandrababu : పచ్చి అబద్ధాలకోరు జగన్ : చంద్రబాబు
మెడికల్ కాలేజీలు తెచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.
- Author : CS Rao
Date : 26-09-2022 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
మెడికల్ కాలేజీలు తెచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ను తీసుకొచ్చిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ఆస్పత్రికి మంచినీళ్లు సరఫరా చేయలేని అసమర్థ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహించారు.
టీడీపీ హయాంలో భూములు కేటాయించి, వసతులు కల్పించి సత్వరం వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ను సిద్ధం చేసింది. ఆనాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పడిన ఈ సంస్థకు పెరిగిన అవసరాలకు అనుగుణంగా నీటి వనరులు సమకూర్చాలని కేంద్రం, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు లేఖలు రాశారు. అయినప్పటికీ జగన్ సర్కార్ పరిష్కారం చూపలేదు.ఈ మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం ఏంచేసిందో చెప్పగలదా? అని చంద్రబాబు నిలదీశారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న సీఎం నివాసం ఉంటోన్న మున్సిపాలిటీ పరిధిలోని ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నాడు? అంటూ ఆగ్రహించారు. కేంద్రమంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి , వైద్యరంగంలో సమూల మార్పులు తెస్తున్నానంటూ బొంకుతున్నాడని విమర్శించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం ఏపీ ప్రజలకు శాపంగా మారకూడదని, వెంటనే మంగళగిరి ఎయిమ్స్ కు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.