Chandrababu : ఎన్నికలకు చంద్రబాబు బ్లూ ప్రింట్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు.
- By CS Rao Updated On - 01:02 PM, Fri - 10 June 22

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తను నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు. ప్రస్తుతం 70 ప్లస్ లోనూ పని విషయంలో ఆయన దూకుడు తగ్గలేదు. నిత్యం ప్రజల్లోకి వెళ్లాలి. వాళ్లతో ఉండాలనే తపన ఆయనది. అందుకే, జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి చంద్రబాబు పక్కా ప్లాన్ చేశారట. వచ్చే ఏడాది జరిగే మహానాడు వరకు నిరంతర పర్యటనలు ఉండేలా బ్లూ ప్రింట్ తయారు అయిందని తెలుస్తోంది.
ఒంగోలు మహానాడు సూపర్ హిట్ కావడంతో జిల్లాల్లో మినీ మహానాడులను వచ్చే ఏడాది వరకు కొనసాగించాలని క్యాడర్ సమాయాత్తం అయింది. అందులో భాగంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం విజయనగరం, అమలాపురం జిల్లాలకు చంద్రబాబు వెళుతున్నారు. ఈనెల 15వ తేదీన మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. చోడవరం వద్ద మినీ మహానాడుకు 15వ తేదీన హాజరు అవుతారు. అమలాపురం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నారు. అక్కడ కొత్త పార్టీ ఆఫీస్ ను ప్రారంభిస్తారు. మరుసటి రోజు (17వ తేదీన) చీపురుపల్లి, గజపతి నగరం ప్రాంతాల్లో రోడ్డు షోలను నిర్వహించడం ద్వారా ఆయన మూడు రోజుల పర్యటన ముగిస్తుంది.
వారానికి మూడు రోజుల పాటు ఏపీలో ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా పర్యటన చేయనున్నారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లను చేర్చుకోవడం, పార్టీలోని అంతర్గత విభేదాలను సరిదిద్దడం, కనీసం 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేలా బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది. మినీ మహానాడుల ద్వారా వైసీపీ చేపట్టిన సామాజిక భేరి యాత్రకు చెక్ పెట్టేలా స్కెచ్ వేశారు. ఇప్పటికే మినీ మహానాడులు విజయవంతం అయ్యాయని టీడీపీ సేకరించిన సర్వే రిపోర్టులు చెబుతున్నాయని తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈసారి కడప జిల్లానూ వదలకుండా బాబు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటీవల కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆయన నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయి. ఆయన కోసం జనం బారులు తీరిన తీరును గమనించిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావిస్తోంది. అధికారంలోకి సునాయాసంగా రావచ్చని అంచనా వేస్తోంది. ఇతర పార్టీల నుంచి సీనియర్లు రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ, యువతకు ప్రాధాన్యం ఇస్తోన్న లోకేష్ ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్న సీనియర్లను హోల్డ్ చేస్తున్నారు. ఒక వేళ పార్టీలో సీనియర్లు చేరినప్పటికీ ఎన్నికల్లో సీటు గ్యారంటీ మాత్రం ఇవ్వడానికి లోకేష్ సిద్ధంగా లేరని తెలుస్తోంది.
చంద్రబాబు నిర్వహిస్తోన్న మినీ మహానాడులు విజయవంతం కావడంతో ప్రత్యర్థి పార్టీల నుంచి లీడర్లు టీడీపీ లోకి రావడానికి క్యూ కడుతున్నారట. ఏడాది మొత్తం జిల్లాల పర్యటనల ద్వారా టెంపో క్రియేట్ చేసి ఎన్నికలకు వెళ్లాలని మాస్టర్ స్కెచ్ వేశారు. గతంలోనూ మీ కోసం యాత్ర ద్వారా 2009 ఎన్నికలకు, వస్తున్నామీకోసం యాత్ర ద్వారా 2014 ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు మినీ మహానాడుల్లో టెంపో క్రియేట్ చేసిన ఎన్నికలకు ఫేస్ చేయాలని బాబు మాస్టర్ స్కెచ్ వేశారు. ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Related News

Jagan Kadapa Tour : రెండు రోజుల కడప పర్యటనకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు గురువారం వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు.