Suparipalana Tholi Adugu : “సుపరిపాలనలో తొలి అడుగు ” కార్యక్రమానికి విశేష స్పందన
Suparipalana Tholi Adugu : ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును నేరుగా వివరిస్తున్నారు
- By Sudheer Published Date - 03:26 PM, Wed - 2 July 25

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ (Suparipalana Tholi Adugu) కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును నేరుగా వివరిస్తున్నారు. పండుగ వాతావరణంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి, ప్రజల అభిప్రాయాలు సేకరించడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం ద్వారా ప్రజలతో పాలన వ్యవస్థను మరింత సమీపించేందుకు కృషి చేస్తున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని, ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. కర్నూల్ జిల్లాలో మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి బుధవారపేటలో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడంతో పాటు, నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. మరోవైపు, విజయనగరం జిల్లా జగ్గాపురంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం గత ఏడాది చేసిన పనులను వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బలమైన బాటలు వేసినట్లు తెలిపారు.
Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని, గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎడమధ్యలో ఆగిపోయిన అంతర్గత రోడ్లు, విద్యుత్ అంతరాయాలపై అధికారులకు సూచనలు చేయాలని పేర్కొన్నారు. పింఛన్లు పెంపు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి హామీలు ఇప్పటికే అమలవుతున్నాయని నేతలు వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పొందడంతో పాటు, తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నారు. ‘సూపర్ 6’ పథకాల అమలులో ప్రభుత్వం సమానత్వంతో పనిచేస్తుందని పలువురు ప్రజలు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో వివక్షను ఎదుర్కొన్నామని, ప్రస్తుతం అందరికీ సమానంగా ప్రయోజనాలు అందుతున్నాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల మద్దతును మరింత పెంచుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.