Nara Lokesh : “క్లాస్‌లో మాస్” లోకేష్!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లాస్ నుంచి మాస్ లీడర్ గా ఎదుగుతున్నాడు. ఇటీవల తీసుకున్న అంశాలన్నీ జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టేవిగా ఉండడం ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
- By CS Rao Published Date - 05:24 PM, Mon - 6 December 21

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లాస్ నుంచి మాస్ లీడర్ గా ఎదుగుతున్నాడు. ఇటీవల తీసుకున్న అంశాలన్నీ జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టేవిగా ఉండడం ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఓటీఎస్ మీద చినబాబు గళం విప్పాడు. ప్రభుత్వం వివరణ ఇచ్చుకునే స్థితికి ఆ అంశాన్ని తీసుకెళ్లాడు. జగన్ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఓటీఎస్ మీద వస్తోన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా లోకేష్ చేసిన పోరాట ఫలితమంటూ టీడీపీ యుత్ భావిస్తోంది.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ సమయంలో క్లాస్ లీడర్ గా మాత్రమే ఆయనకు గుర్తింపు ఉండేది. అధికారులతో ఆయన మమేకం అయిన తీరు కూడా క్లాసికల్ గా ఉండేదట. అందుకే..లోకేష్ కు క్లాస్ లీడర్ గా ముద్రపడింది. ఇటీవల వరకు అలాంటి గుర్తింపుకు మాత్రమే లోకేష్ పరిమితం అయ్యాడు.
అధికారం కోల్పోయిన తరువాత తొలి రోజుల్లో లోకేష్ క్లాస్ టచ్ ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. సమకాలీన రాజకీయాల్లో మాస్ యాంగిల్ మాత్రమే పనిచేస్తుందని ఆయన అభిమానులు భావించారు. అందుకే, చినబాబుకు మాస్ టచ్ ను అలవాటు చేశారు. `జగన్ రెడ్డి..రాజారెడ్డి రాజ్యాంగం..` అంటూ తొలి విడత మాస్ యాంగిల్ ను ఓపెన్ చేశాడు. మలివిడత `ఒరేయ్..జగన్ రెడ్డి..` అంటూ సంభోదించడం ప్రారంభించాడు. దీంతో మాస్ లీడర్ గా ఆయన అభిమానుల్లోకి వెళ్లిపోయాడు. కర్నూలు పర్యటన సందర్బంగా చినబాబు చేసిన ప్రసంగం ఫుల్ మాస్ యాంగిల్ ను సంతరించుకుంది.కోవిడ్ సందర్భంగా రెండేళ్లు దాదాపు జూమ్ ద్వారా క్యాడర్ ను లోకేష్ అప్రమత్తం చేశాడు. జగన్ సర్కార్ ను ఎదుర్కోవడానికి మానసికంగా కార్యకర్తలను సిద్ధం చేశాడు. టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోసం ఆయన జూమ్ పోరాటం చేశాడు. ఎలాగైనా, పరీక్షలను నిర్వహించాలని జగన్ సర్కార్ ఆనాడు ప్రయత్నం చేసింది. చివరకు చినబాబు చేసిన డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. అదే, ఆయన ప్రభుత్వం మీద సాధించిన తొలి విజయంగా చెప్పుకోవచ్చు. ఆనాటి నుంచి ఏ మాత్రం వెనుకకు తగ్గకుండా పోరాటాలకు పదును పెడుతున్నాడు.
దళితులపై దాడులు, అత్యాచారాలు..మహిళల హత్యలు..కార్యకర్తలపై హత్యలు, దాడులు..ఇలా అనేక అంశాలపై క్షేత్రస్థాయి పోరాటాలకు లోకేష్ వెళ్లాడు. నర్సరావుపేటలో జరిగిన అత్యాచారం, హత్య సంఘటనపై ఆరా తీయడానికి లోకేష్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆయన్ను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ పెట్టిన పోలీసు పహారా గమనిస్తే చినబాబు మాస్ లీడర్ గా ఎలా ఎదిగాడో..అర్థం అవుతోంది.తాజాగా ఓటీఎస్( ఒన్ టైం సెటిల్ మెంట్) .. జగనన్న భూ హక్కు పథకం పై పోరాటం చేస్తున్నాడు లోకేష్. సామాన్యులపై పడుతోన్న భారాన్ని అడ్డుకోవడానికి ఆయన నడుం బిగించాడు. వారం క్రితం ఈ అంశాన్ని ఆయన తెరమీదకు తీసుకొచ్చాడు. సుమారు 50లక్షల కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ అది. కొన్ని దశాబ్దాలుగా పేదలకు ఇస్తోన్న పక్కా గృహాలు, ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ అంటూ జగన్ సర్కార్ ముందుకొచ్చింది. ఆ రూపంలో ఒక్కో కుటుంబం నుంచి. రూ5 వేల నుంచి రూ. 15వేలు వసూలు చేయడానికి జగన్ సిద్ధం అయ్యాడు. ఎప్పుడో ఇచ్చిన వాటికి ఇప్పడు రిజిస్ట్రేషన్ ఏంటని లోకేష్ వారం క్రితం ప్రశ్నించాడు. ఏ సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోకుండా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని మీడియా ముఖంగా ధ్వజమెత్తాడు. మిగిలిన పార్టీలు ఇప్పుడు అదే ప్రశ్నను సంధిస్తున్నాయి. ఫలితంగా జగన్ సర్కార్ ఇరుకున పడింది. ఇదంతా లోకేష్ లోని మాస్ కోణం ఎఫెక్ట్ గా ఆయన అభిమానులు భావిస్తున్నారు. సో…లోకేష్ క్లాస్ లో మాస్ కోణాన్ని తమ్ముళ్లు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.