Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు
నైరుతి రుతు పవనాల(Southwest Monsoon) విస్తరణకు అనుకూల వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఉందని పేర్కొంది.
- By Pasha Published Date - 01:06 PM, Mon - 26 May 25
Southwest Monsoon : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. ఇవి రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతు పవనాల(Southwest Monsoon) విస్తరణకు అనుకూల వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
Also Read :Vidyadhan Scholarship : టెన్త్‌లో కనీసం 9 సీజీపీఏ ఉంటే రూ.75వేల దాకా స్కాలర్‌షిప్
కేరళలో..
ఈసారి నైరుతి రుతుపవనాలు 8 రోజులు ముందే కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కేరళలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది.
ముంబైలో..
మహారాష్ట్ర రాజధాని ముంబైని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎయిర్‌ఇండియా సహా పలు ఎయిర్‌లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. విమాన సర్వీసులు, వాటి వేళల సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను ఎప్పటికప్పుడు చూడాలని ప్రయాణికులను కోరాయి. ముంబైలోని దాదార్, మహిమ్, పరెల్, బాంద్రా, కాలాచౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఢిల్లీ, కర్ణాటకలలో..
దేశ రాజధాని ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అక్కడ శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వాన పడింది. విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది.తమిళనాడులోని ఊటీలో ఆదివారం ఒక బాలుడిపై చెట్టుపడింది దీంతో అతడు చనిపోయాడు. కర్ణాటకలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.