Vijayasai Reddy : వాళ్ల వల్లే నాకు, జగన్‌కు విభేదాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్‌కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నా’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు.
- By Pasha Published Date - 03:40 PM, Wed - 12 March 25

Vijayasai Reddy : వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్సార్ సీపీలో ఎదగాలని తహతహలాడుతున్న కొందరు నేతలే.. తనకు, జగన్‌కు మధ్య విభేదాలను సృష్టించారని ఆయన ఆరోపించారు. వాళ్లు ఎదగడానికి తనను కిందికి లాగారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కొందరు పాత్రధారులు, ఇంకొందరు సూత్రధారులు ఉన్నారని చెప్పారు. జగన్ కనీసం ఇప్పటికైనా ఆ కోటరీ నుంచి బయటపడాలని, బయటపడితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. ‘‘జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే, నేను వైఎస్సార్ సీపీని వీడాను. కోటరీ మాటలు వినొద్దని నేను చెప్పినా జగన్ పట్టించుకోలేదు. విరిగిన మనసు అతుక్కోదు. వైఎస్సార్ సీపీలో మళ్లీ చేరేది లేదు. జగన్‌కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నా’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు. ‘‘జగన్ నా గురించి మాట్లాడుతూ విశ్వసనీయత, ధైర్యం గురించి చెప్పారు. నేను ఇప్పటికీ అవే లక్ష్యాలతో ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నాయకుడు అనే వాడు చెప్పుడు మాటలను నమ్మకూడదు. అలాంటి మాటలు నమ్మితే పార్టీకి, నాయకుడికి నష్టం జరుగుతుంది’’ అని జగన్‌ను ఉద్దేశించి విజయసాయి కామెంట్ చేశారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Yogi Adityanath: నేపాల్ పాలిటిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి
లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అన్నీ అతడే
‘‘లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. పోర్టు వ్యవహారంలో అంతా విక్రమ్ రెడ్డే. విక్రమ్ రెడ్డి, నాకు సుబ్బారెడ్డి కుమారుడిగానే తెలుసు. సుబ్బారెడ్డి అమెరికాకు వెళ్లిన సమయంలో కేవీ రావు ఇంట్లోనే ఉండేవారు. కేవీ రావుతో ముఖపరిచయం తప్ప లావాదేవీలు లేవు. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Also Read :Holi Festival: హోలీ వేళ.. ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం
ఓ అధికారి ఆదేశాలతో నా పేరు ఇరికించారు
‘‘ఈ కేసు గురించి కేవీ రావుతో స్నేహితుడి ద్వారా మాట్లాడించా. ఓ అధికారి ఆదేశాలతో నా పేరు ఇరికించినట్టుగా కేవీరావు చెప్పారు’’ అని ఆయన తెలిపారు. కేవీరావుకు విక్రాంత్‌రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ వ్యవహారాల గురించి మరిన్ని వివరాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తానన్నారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై విజయ సాయిరెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రారెడ్డి, ఏ4గా శ్రీధర్, ఏ5గా అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది.