Nallari Family : మాజీ సీఎం కిరణ్ కుమారుడి పొలిటికల్ ఎంట్రీ.. స్కెచ్ అదేనా ?
నిఖిలేశ్‌ను కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Family) తన అనుచరులకు పరిచయం చేసి వాళ్లతో మమేకం అయ్యేలా చేస్తున్నారు.
- By Pasha Published Date - 09:05 AM, Thu - 17 April 25

Nallari Family : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ సీఎం. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపు దాల్చిన సమయంలోనూ సీఎంగా మూడేళ్ల పాటు చక్కటి పాలన అందించిన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తీవ్ర ఒత్తిళ్లు చుట్టుముట్టినా.. పాలనా వ్యవహారాలను గాడి తప్పకుండా నడిపిన సమర్ధుడు కిరణ్ కుమార్ రెడ్డి. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ వారసుడు రంగంలోకి దిగబోతున్నాడు. దీనిపైనే ఇప్పుడు పీలేరులో చర్చ జరుగుతోంది.
Also Read :MLA Adinarayana Reddy: సిమెంటు పరిశ్రమలకు బీజేపీ ఎమ్మెల్యే టార్చర్ !
నిఖిలేశ్ రెడ్డి పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏది ?
మాజీ సీఎం కిరణ్ కుమారుడు నిఖిలేశ్ రెడ్డి పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. నిఖిలేశ్‌ను కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Family) తన అనుచరులకు పరిచయం చేసి వాళ్లతో మమేకం అయ్యేలా చేస్తున్నారు. క్యాడర్‌తో కలుపుగోలుగా నడుచుకుంటున్న నిఖిలేశ్.. తన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన నిఖిలేశ్ రెడ్డి, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక.. నిఖిలేశ్ రెడ్డి పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏది ? అనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ప్రస్తుతం పీలేరు ఎమ్మెల్యేగా నిఖిలేశ్ బాబాయి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నల్లారి ఫ్యామిలీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో రెండు చోట్ల పోటీ చేసింది. పీలేరు నుంచి పోటీ చేసిన కిరణ్ తమ్ముడు నల్లారి కిశోర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నల్లారి కిరణ్ ఓడిపోయారు.
Also Read :DC vs RR: ఐపీఎల్‌లో సంచలనం.. ఈ ఏడాది తొలి సూపర్ ఓవర్‌లో ఢిల్లీ ఘన విజయం!
కొత్తగా ఏర్పడే అసెంబ్లీ స్థానమా ?
నల్లారి వారి కుటుంబం గత 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. ఆ రాజకీయ వారసత్వాన్ని నిఖిలేశ్ రెడ్డి కంటిన్యూ చేయబోతున్నారు. తన కుమారుడికి ఒక అసెంబ్లీ స్థానాన్ని వెతికి పెట్టే దిశగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. నిఖిలేశ్ రెడ్డికి రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కిరణ్ అప్పగిస్తారా ? నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఏర్పడే ఏదైనా కొత్త అసెంబ్లీ స్థానానికి కుమారుడిని కిరణ్ పంపుతారా ? అనే కోణంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. రాజకీయ వ్యూహాలను తయారు చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట. ఆయన ఆలోచనలను ఎవరూ ముందే అంచనా వేయలేరు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా గతంలో తన తండ్రి అమర్నాథ్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. అమర్నాథ్ రెడ్డి ఆ రోజులలోనే మంత్రిగా ఉంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.