Minister Roja: రోజా మంత్రి పదవికి ఎసరు..?
చిత్తూరు జిల్లాలోని వైసీపీ గ్రూప్ రాజకీయాలు రోజా మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి.
- Author : CS Rao
Date : 13-11-2022 - 4:38 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్తూరు జిల్లాలోని వైసీపీ గ్రూప్ రాజకీయాలు రోజా మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు పంచాయతీ చేసిన జగన్ ఆమెను పక్కన పెట్టె అవకాశం ఉందని టాక్. తాజా సర్వేలోను రోజా బాగా వెనుకబడి ఉన్నారని తాడేపల్లి సర్కిల్స్ లోని వినికిడి. 2024 ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది. ఆ మేరకు ఆమెకు పరోక్ష సంకేతాలు అధిష్టానం నుంచి వెళ్లాయని ఆమె వ్యతిరేక గ్రూప్ ప్రచారం చేస్తోంది. పైగా ఇప్పుడు జనసేన కార్యకర్తలతో ఆమె తలపడటం మైనస్ గా మారింది. ఫలితంగా మంత్రి పదవి త్వరలోనే ఊడుతుందని సర్వత్రా జరుగుతున్న చర్చ.
ఒక జిల్లాలో ఒకే సామాజికవర్గం నుంచి ఇద్దరు బలమైన నాయకులు ఉంటే ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవటం సహజం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి బలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని ఏమీ చెయ్యరు. కానీ రోజాకు మంత్రి పదవి ఇవ్వటం ఆ జిల్లాలో రచ్చగా ఉంది. జిల్లాలోని ఇద్దరు మంత్రులకు మధ్య పొసగదనే సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెసు పార్టీలో ఉన్న నాటి నుంచి చిత్తూరు జిల్లాకు పెద్దదిక్కు సీనియర్ నాయకుడైన పెద్దిరెడ్డికి జిల్లా అంతటా విస్తృతమైన పరిచయాలు, అనుచరగణం ఉన్నారు. నగరి నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి గ్రూపు రోజాకు కంటకంగా మారారు. ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని కూడా సజావుగా సాగనివ్వరు. తగాదా పెట్టుకుంటారు.
Also Read: Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు…ఈసారి ఎందుకంటే..!!
తాజాగా నగరి నియోజకవర్గం వడమాటలపేటలోని ఓ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని అనుకుంటే, స్థానిక జడ్పీటీసీ అయిన పెద్దిరెడ్డి గ్రూపు నాయకుడు అడ్డు పడ్డాడు. ఇంకా బిల్లులు 23 లక్షలు పెండింగ్ ఉండగా అప్పుడే ఎందుకు ప్రారంభించాలంటూ అడ్డుకున్నాడు. అసలు బిల్లులు పెండింగ్ లో ఉంటే భవనమే ప్రారంభించకూడాదని రచ్చచేసి ఏకంగా తలుపు తాళం వేసుకుని వెళ్లాడు. ఒక వేళ ప్రారంభించాల్సి వస్తే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఆహ్వానించాలనేది అతని డిమాండ్. ఏ మాత్రం తగ్గని రోజా పోలీసుల సహాయంతో మొత్తానికి ఆ ప్రారంభోత్సవం అయిందనిపించారు. ఇటీవల ఆమె జగన్ ఎదుట నియోజకవర్గంలో ఎదురవుతున్న ముఠా తలనొప్పుల గురించి మొరపెట్టుకున్నారు. అయినా ఏమీ ప్రయోజనం ఉన్నట్టు లేదు. అంటే రోజాకు త్వరలో మంత్రి పదవి పోతుందని రామచంద్రారెడ్డి గ్రూప్ విశ్వసిస్తుంది.