Roja : పార్టీ వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా
Roja continue in YCP : తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు.
- By Latha Suma Published Date - 02:41 PM, Fri - 13 September 24

Roja continue in YSRCP: వైసీపీ మాజీ మంత్రి రోజా మళ్లీ నగరిలో దూకుడు రాజకీయాలను చేయనున్నారని తెలుస్తుంది. ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రోజా తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి తాను పార్టీలోనే కొనసాగుతున్నానని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మొన్నటివరకు వైసీపీకి గుడ్ బై చెప్పి తమిళనాడులో విజయ్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగిన రోజా మళ్లీ వైసీపీలోనే కొనసాగుతానని అందరికీ అర్థమయ్యేలా చేశారు.
ఏకంగా వారిని పార్టీలోనే లేకుండా చేశారు..
తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టాలని భావించిన రోజా ఏకంగా వారిని పార్టీలోనే లేకుండా చేశారు. నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు కే.జే కుమార్ ను ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి లను తాజాగా పార్టీ నుంచి తొలగిస్తూ ప్రకటన చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
ఇక పై వారు చేసే పనులతో తమ పార్టీకి సంబంధం లేదు..
నగరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, మాజీ ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి ల పైన పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా పార్టీ కార్యాలయానికి లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని, దీనిపైన క్రమశిక్షణ కమిటీ విచారణ జరపగా వారిపై పేర్కొన్న అభియోగాలు అన్ని వాస్తవమని తేలిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు వారిని పార్టీ నుంచి తొలగిస్తూ వారి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక మీద వారు చేసే కార్యక్రమాలతో, చట్ట విరుద్ధమైన పనులతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎన్నికలలో రోజా ఓటమికి వీరే కారణమని రోజా పైన బహిరంగంగానే వీరు ఎప్పటికప్పుడు వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ నగరి నియోజకవర్గంలో రోజా ఇమేజ్ కు డామేజ్ చేశారని రోజా జగన్ మోహన్ రెడ్డి కి చెప్పినట్టు సమాచారం. ఇక వైయస్ జగన్ ను కలిసిన మరుసటిరోజే కేజే దంపతులపై వేటుపడడం రోజాకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. మొత్తానికి ఈ చర్యతో రోజా తాను అనుకున్నది సాధించారు. కేజే దంపతులకు చెక్ పెట్టారు.