Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.
- By Latha Suma Published Date - 01:24 PM, Wed - 15 January 25

Skill Development Case : సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జనవరి 15న (ఈరోజు)కొట్టివేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు.
కాగా, 2023 నవంబర్‌లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ను రద్దు చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఈరోజు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని జర్నలిస్టు ఇంప్లీడ్ పిటిషన్ వేయగా.. దాన్ని కొట్టివేస్తూ జర్నలిస్టుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ కేసుకు మీకు సంబంధం ఏంటి… మీరెందుకు ఇందులో జోక్యం చేసుకున్నారు. అంటూ జర్నలిస్టును కోర్టు మందలించింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నైపుణ్యాభివృద్ధి సంస్థకు (స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. స్కిల్ కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా సీఐడీ పేర్కొంది. ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్, డిజైన్ టెక్, పీవీఎస్‌పీ స్కిలర్ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.
వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్‌లో పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగంలో నిందితుల పాత్ర ఉందని సీఐడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. కుట్రలో భాగంగా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించింది.
Read Also: Harish Rao: మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు