Ramoji Rao : ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు రామోజీ సంస్మరణ సభ
మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది.
- By Pasha Published Date - 01:00 PM, Wed - 26 June 24

Ramoji Rao : మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది. విజయవాడలోని కానూరులో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్ల పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
మంత్రుల కమిటీకి సహకరించేందుకు అధికారులతో మరో కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీకి సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ పోలీసు కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీతోపాటు మరికొందరు అధికారుల్ని కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read :CM Chandrababu: కుప్పంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ప్రజలతో చంద్రబాబు
గురువారం నిర్వహిస్తున్న సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 7 వేల మంది ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సభ ప్రధాన వేదిక, దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు, హాజరుకానున్న ప్రముఖులకు వసతి, రవాణా, ఇతర ఏర్పాట్లను అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు.