AP Politics : ఏపీ రాజకీయానికి బీహార్ ఫ్లేవర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యులు రుషీరాజ్ సింగ్, రాబిన్ సింగ్ వ్యూహాలతో ఏపీ రాజకీయం రక్తికడుతోంది. వాళ్లిద్దరూ బీహార్‌కు పీకే ప్రధాన శిష్యులు.
- Author : CS Rao
Date : 23-11-2022 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యులు రుషీరాజ్ సింగ్, రాబిన్ సింగ్ వ్యూహాలతో ఏపీ రాజకీయం రక్తికడుతోంది. వాళ్లిద్దరూ బీహార్‌కు పీకే ప్రధాన శిష్యులు. 2019 ఎన్నికల సందర్భంగా పీకే టీమ్ లో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల మధ్య రుషిరాజ్ సింగ్ వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి రాబిన్ సింగ్ రాజకీయ బ్లూప్రింట్ ను తయారు చేసి ఎల్లోటీమ్ ను ముందుకు నడిపిస్తున్నారు. `గడప గడపకు మన ప్రభుత్వం` పేరుతో రుషిరాజ్ సింగ్ వైసీపీ శ్రేణులను ప్రజల వద్దకు పంపారు. దానికి ధీటుగా `ఇదేం ఖర్మ` పేరుతో ఓటర్ల వద్దకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగట్టే కార్యక్రమానికి టీడీపీ తరపున రాబిన్ సింగ్ తెరలేపారు.
సాధారణంగా ఎవరి ప్రచారం వాళ్లు చేసుకుంటారు. అంతిమంగా ఓటర్లు ఎవర్ని ఆదరిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ, ఇప్పుడు ఏపీలో ఒక పార్టీ వాళ్లు ఓటర్ల వద్దకు వెళితే మరో పార్టీ వాళ్లు అడ్డుకోవడం కనిపిస్తోంది. సభలు, సమావేశాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా టీడీపీ `ఇదేం ఖర్మ` ప్రోగ్రామ్ తో ప్రజల మధ్యకు వెళుతుంటే ఓటర్ల రూపంలో వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. గత వారం కర్నూలు వెళ్లిన సందర్భంగా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని చూశాం. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం గమనార్హం.
Also Read: YS Jagan Meeting : జగన్ సభ `ఒక్క ఫోటో`వందరెట్ల అభద్రత!
ఇటీవల `గడప గడపకు మన ప్రభుత్వం`, సామాజిక భేరి పేరుతో మంత్రుల బస్సు యాత్ర జరిగినప్పుడు ప్రజలు వాళ్లను నిలదీశారు. పలు చోట్ల సామాజిక భేరి విఫలం అయింది. అందుకే, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ, ఓటర్ల వద్దకు వెళ్లినప్పుడు పలు చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలకు వ్యతిరేకత ఎదురు కావడంతో పాటు వెంబడిస్తున్నారు. ఇదంతా టీడీపీ శ్రేణులు చేస్తోన్న పనిగా వైసీపీ భావిస్తోంది. ఇలా పరస్పరం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల మధ్య ప్రచార రాద్దాంతం కొనసాగుతోంది.
ప్రధాన పార్టీల మధ్య అప్పుడప్పుడు వచ్చే జనసేనాని పవన్ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర రాజకీయాన్ని హీట్ ఎక్కిస్తున్నారు. ఎలాంటి ఎజెండా లేకపోయినప్పటికీ `ఒక్క ఛాన్స్` అంటూ ఇటీవల పవన్ వేదికలపై చెప్పడం ప్రారంభించారు. ఆ పార్టీ వ్యూహకర్తలు లేకపోయినప్పటికీ పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఉంది. పీఏసీ చెప్పే వ్యూహం ప్రకారం నడుచుకుంటూ పవన్ ముందుకు నడుస్తున్నారు. మొత్తం మీద పీకే టీమ్ వేస్తోన్న ఎత్తుగడలు ఏపీ రాజకీయాన్ని బీహార్ ను మించే విధంగా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Jockey Andhra Pradesh : రాయలసీమలో `జాకీ` జగడం