Devineni Family : బాబాయ్ వర్సెస్ అబ్బాయ్… “దేవినేని” ఫ్యామిలిలో పొలికల్ హీట్..!
కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభవం తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీలక...
- Author : Prasad
Date : 16-09-2022 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభవం తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీలక నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, కొడాలి నానిలను ఓడించాలని ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు విస్తృత స్థాయి సమావేశంలో శపథం చేశారు. అయితే ఈ శపథాలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్..తన బాబాయ్ దేవినేని ఉమామహేశ్వరరావు పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశం అంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని అవినాష్ తెలిపారు .స్టేజ్ మీద తొడలు కొట్టి , శపథాలు చేసిన టీడీపీ నేతల చీకటి బతుకులు తనకు తెలుసని దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడు అని.. రాత్రి అయితే చంద్రబాబు అంత వెదవ లేడని కృష్ణాజిల్లా నేతలే తిడతారని వ్యాఖ్యానించారు.
జగన్ కటౌట్ ముందు కృష్ణాజిల్లాలో ఉన్న ఐదు అడుగుల నాయకులు ఎందుకు పనికి రారని.. వారి గురించి మాట్లాడాల్సి అవసరం లేదన్నారు. టీడీపీ నేతలు తొడలు కొడితే సౌండ్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలిచి క్లాస్ పీకితే తప్ప టీడీపీ నేతలికి సోయ రాలేదన్నారు. విజయవాడ నగరంలో నెహ్రూ వ్యవస్థకి, ఆయన కుమారుడికి, ఆయన మనుషులకు వార్నింగ్ ఇచ్చే దమ్ము, ధైర్యం ఎవరికి లేదని దేవినేని ఉమాకి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబసభ్యులు తిడితే తన కార్యకర్తలు ఎవరూ సహించరని… తొడలు కొట్టించిన మాజీ మంత్రి దేవినేని ఉమాకి మైలవరంలోనే గతిలేదు కానీ ఇక్కడ అందరి చేత తొడలు కొట్టి కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారని అవినాష్ మండిపడ్డారు.