Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!
అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
- By Latha Suma Published Date - 07:31 PM, Mon - 30 December 24

Perni Jayasudha: గోదాములో బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. దీంతో గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు తేల్చారు.
ఈ క్రమంలో, పెరిగిన షార్టేజికి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు.
కాగా, పోలీసులు రేషన్ బియ్యం మాయం కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డినే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయంపై ఇటీవల కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, ముందస్తు బెయిల్ కోసం జయసుధ పెట్టుకున్న పిటిషన్‌పై జిల్లా కోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వు చేసి ఉంచారు. ఈ తీర్పును డిసెంబర్ 30న వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే.