Amaravati Relaunch : అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్
Amaravati Relaunch : ప్రధాని మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నారని ప్రశంసిస్తూ, అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరించినట్లు తెలిపారు
- Author : Sudheer
Date : 02-05-2025 - 4:43 IST
Published By : Hashtagu Telugu Desk
రాజధాని అమరావతి పునర్ నిర్మాణ (Amaravati Relaunch) పనులకు ప్రధాని మోదీ (Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా వేల కోట్ల రూపాయిల పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు.
పునఃప్రారంభమైన అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అమరావతిని తుపానులా తుడిచేసిందని, కానీ ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
అమరావతి రైతుల త్యాగాలు అమోఘమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఐదేళ్లుగా బాధలు అనుభవించిన రైతులు లాఠీదెబ్బలు తిని, కన్నీళ్లు పెట్టుకున్నారనీ, “మా కన్నీళ్లు తుడిచేవారెవరూ?” అని తనను అడిగిన సందర్భాలను గుర్తు చేశారు. తాను వారి త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అమరావతి రైతులు కేవలం భూములు ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు.
పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయకత్వాన్ని అభినందించారు. గతంలో ఆయన నేతృత్వంలో సైబరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు ఇప్పుడు అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతారని చెప్పారు. చంద్రబాబుతో కలిసి పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నారని ప్రశంసిస్తూ, అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరించినట్లు తెలిపారు. ఇది ఒక సాధారణ పునఃప్రారంభం కాదు, ఏపీ ప్రజల ఆశలకు కొత్త చిగురుసమానమని పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా వ్యక్తపరిచారు.